తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిన ఆస్పత్రి బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి. అత్యంత ఖరీదైన క్యాన్సర్ వైద్యాన్ని పేదలకు అతి తక్కువ ధరకు ఇస్తూ.. ఎంతో మందికి ప్రాణదానం చేస్తున్న ఆస్పత్రి అది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా పేదలకు క్యాన్సర్ అంటే ముందుగా హైదరాబాద్లోని బసవతారకం ఆస్పత్రి వద్దకే వస్తారు. ఎంత మినిమం చార్జీలు తీసుకున్నా సర్వీసులో మాత్రం అద్భుతమైన పనితీరు చూపిస్తుంది ఆస్పత్రి. ఇప్పుడు క్యాన్సర్ చికిత్సలో దేశంలోనే రెండో స్థానంలో ఈ ఆస్పత్రి నిలిచింది.
ప్రముఖ మ్యాగజైన్ ఔట్ లుక్ నిర్వహించిన సర్వేలో దేశంలో అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం అందించే ఆస్పత్రులలో ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రి మొదటి స్థానంలో నిలవగా రెండో స్థానంలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిలిచింది. ఈ ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ. ఈ ఆస్పత్రి లో మెరుగైన వైద్య సౌకర్యల కోసం బాలకృష్ణ నిరంతరం తపన పడుతూంటారు. పెద్ద ఎత్తున విరాళాల సేకరణకు సమయం కేటాయిస్తూ ఉంటారు. ఎక్కడా చిన్న సమస్య రాకుండా చూసుకుంటూ ఉంటారు. క్యాన్సర్ ఆస్పత్రి నిర్వహణలో ఆయన తీరు ఔట్ లుక్ పత్రిక ప్రశంసించింది. నిరుపేదలకు అతి తక్కువ ధరకే అద్భుతమైన క్యాన్సర్ చికిత్స అందిస్తున్నారని కొనియాడింది.
బసవతారకం ఆస్పత్రి సాధించిన ఘనతపై.. చంద్రబాబునాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు చెప్పారు. క్యాన్సర్ చికిత్సలో అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక చికిత్స పద్దతుల్ని ఎప్పటికప్పుడు సమకూర్చుకుంటూ మంచి వైద్య సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు.