పాటల్లో ఎంత హీరోయిజం అయినా గుప్పిస్తారు గీత రచయితలు. హీరో ఎంట్రీ సాంగ్ అంటే ఎలివేషన్లు కుమ్మేసుకోవాల్సిందే. అయితే అప్పుడప్పుడూ.. జీవిత సత్యాన్నీ, సారాన్నీ రంగరించే పాటలు కొన్ని వస్తుంటాయి. అలాంటి పాటలు రాయడంలో భాస్కరభట్ల రవికుమార్ దిట్టే. `సత్తే ఏ గొడవా లేదు`, `కృష్ణానగరే మామా`.. ఇలాంటి పాటలే. ఇప్పుడు `అనుభవించు రాజా`లో కూడా అలాంటి పాట రాసే సందర్భం దొరికింది. `చిన్న జీవితాన్ని అనుభవిస్తూ బతకాలి..` అనే తత్వం వచ్చేట్టు రాశారు. రాజ్ తరుణ్ హీరోగా నటించిన చిత్రమిది. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 26న విడుదల అవుతోంది.
ఇప్పటికే ఈసినిమా నుంచి ఓ టీజర్ బయటకు వచ్చింది. ఓ పాటా వినిపించారు. ఇప్పుడు మరో పాట `బతికేయ్ హాయిగా` విడుదల చేశారు. దీపు ఆలపించిన ఈ పాటకు గోపీ సుందర్ స్వరాలు అందించారు. ఊర్లో బలాదూర్ గా, జల్సారాయుడిలా తిరిగే కథానాయకుడు, పట్నం వచ్చి, బాధ్యతలు తెలుసుకుని, ఓ సెక్యురిటీ బాయ్ గా పని చేయాల్సివచ్చినప్పుడు అసలు జీవితంలోని తత్వం ఏమిటో? సంపాదన అంటే ఏమిటో? అర్థం అవుతుంది. ఆ క్రమంలో సాగే పాట ఇది. పక్కవాడిలో లోపాలు వెదక్కు, ప్రతీవాడిలోనూ ఏదో ఓ దోషం ఉంటుంది, దోషం లేకపోతే.. వాడు మనిషే కాడు.. అనే టైపులో చరణాలు సాగాయి. వింటూ వింటూ ఉంటే.. బాగానే ఎక్కే పాటలానే ఉంది. గోపీ సుందర్ ఆల్బమ్ అంటే… కచ్చితంగా ఓ మెలోడీ ఉండడం ఖాయం. ఆ కోవలో ఈ పాట చేరిపోతుంది.