పూల పండుగతో తెలంగాణ ఆడపడచులు ఆడిపాడి ఆనందించే కాలమిది. పెత్రమాస నాడు మొదలై దుర్గాష్టమితో ముగిసే బతుకమ్మ వేడుకలతో తెలంగాణ పల్లెలు కళకళలాడుతాయి. రంగు రంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు కనువిందు చేస్తాయి. ఆడపడచులు రోజంతా బతుకమ్మలను పేర్చడం, సాయంత్రం బతుకమ్మ ఆడటం.. ఆనందాన్ని పంచుకోవం అరుదైన అనుభవం. ఏడాది పొడుగునా ఎన్ని కష్టాలున్నా ఈ తొమ్మది రోజులూ తెలంగాణ మహిళలు ఆనందంగా గడుపుతారు. కష్టాలను మరిచిపోతారు. తమ కుటుంబాలు బాగుండాలంటూ బతుకమ్మను వేడుకుంటారు. ఇది సామాన్యుల పండుగ. ఆడంబరాలు లేని అచ్చమైన జనం వేడుక.
గునుగు, తండేడు, బంతి, తామెర, గుమ్మడి, దోసపువ్వు, కట్ల పువ్వు, బీరపువ్వు, గడ్డి పువ్వు.. ఇలా పల్లెల్లో ఎక్కడైనా లభించే పువ్వులతో బతుకమ్మను పేరుస్తారు. బతుకమ్మ పండుగలో ప్రకృతిని ప్రేమించే ఆనవాయితీ ఉంది. ఇప్పుడు ఉపన్యాసాల్లో వినే పర్యావరణ పరిరక్షణ వంటి పెద్ద పెద్ద మాటలు చెప్పకపోయినా, ఈ వేడుకల్లో మహిళలు చేసేది అదే. ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతికి దగ్గరగా జీవించడం బతుకమ్మ పండుగలో అంతర్లీనంగా ధ్వనించే సందేశం. అసలు దసరా సీజన్ తెలంగాణలో సిసలైన ఆనందాల కాలం. తెలంగాణ అంతటా ఆనంద తాండవం కనిపిస్తుంది. పూల పరిమళం, దుర్గా నవరాత్రితో ఆధ్మాత్మిక వైభవం, దసరా నాడు సరదా వేడుకలు తెలంగాణలో సంతోష తరంగాలకు సంకేతాలుగా కనిపిస్తాయి.
మన దేశంలో పండుగలకు, పాడి పంటలకు అవినాభావం సంబంధం ఉంది. కోస్తా ఆంధ్రలో వరి కోతల సమయంలో వచ్చే సంక్రాంతి పెద్ద పండుగ అయింది. పంజాబ్ లో పంటలు ఇంటికొచ్చే సమయంలో వచ్చే బైసాఖీ పెద్ద పండుగ అయింది. శతాబ్దాల క్రితం ఇరిగేషన్ ప్రాజెక్టులు లేని తెలంగాణలో వర్షాధారంగా పంటలు పండించే వారు. కాబట్టి మక్క (మొక్కజొన్న) పంటను ఎక్కువగా సాగు చేసే వారు. ఆ పంట ఇంటికి వచ్చే వేళ వచ్చే పండుగ దసరా. కాబట్టి ఇది పెద్ద పండుగ అయింది. అదే ఆనవాయితీ కొనసాగుతోంది. దసరా వేడుకల వేళ పర్యావరణ పరిరక్షణే కాదు, పెద్దలను చిన్నవాళ్లు గౌరవించడం అనే సంస్కారాన్ని గుర్తు చేసే సంప్రదాయం కూడా ఉంది. దసరా నాడు జమ్మి ఆకును తెచ్చి దాన్ని బంగారం అని పిలుస్తారు. పెద్ద వాళ్ల చేతిలో ఆ బంగారం పెట్టి కాళ్లకు మొక్కుతారు. వారి ఆశీర్వాదం తీసుకుంటారు. పేద, ధనిక తారతమ్యం లేకుండా పెద్దలను గౌరవించాలనే ఆ సందేశం అద్భుతం. అందుకే, దసరా వచ్చిందంటే ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసే వారు కూడా సొంత ఊరికి రావాలని తపించి పోతారు. ఆత్మీయుల మధ్య దసరా వేడుకలు జరుపుకొని, ఏడాదికి సరిపడా మధుర స్మృతులను మోసుకుని పోతారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి బతుకమ్మ వేడుకలు అధికారికంగా, ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఈ తొమ్మది రోజులూ తెలంగాణ పల్లెల్లో, పట్టణాల్లో ఆనంద పారవశ్యమే.