తెలంగాణ మహిళలకు ఇష్టమైన పండుగ బతుకమ్మ ఈసారి మరింత వైభవంగా జరిగింది. ఎంగిపూల బతుకమ్మతో మొదలైన వేడుకలు ఆదివారం నాడు సద్దుల బతుకమ్మతో ముగిశాయి. ఈసారి బతుకమ్మసంబరాలకు పెద్ద విశేషమే ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబురాలు జరుపుకోవడం ఇది ముచ్చటగా మూడోసారి. రాష్ట్రప్రభుత్వ నిధులతో ఏర్పాట్లుచేయడం ఆనవాయితీగా మారింది. గత ఏడాదితో పోలిస్తే నిధుల కేటాయింపే కాదు, వేడుకకు ఆదరణ, ప్రాచుర్యం కూడా పెరిగింది.
పూల పండుగ బతుకమ్మకు గిన్నిస్ రికార్డు సొంతమైంది. సద్దుల బతుకమ్మకు ముందు రోజు, హైదరాబాద్ ఎల్ బి స్టేడియంలో ఏకకాలంలో 9292 మంది మహిళలు బతుకమ్మ ఆడారు. ఓనం సందర్భంగా కేరళలో మహిళలు నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టారు. బతుకమ్మకు గిన్నిస్ బుక్ లో చోటు కల్పించారు. ఇది రికార్డేనని గిన్నిస్ ప్రతినిధి ప్రకటించగానే స్టేడియం హర్షధ్వానాలతో మార్మోగింది.
వరసగా 9 రోజుల పాటు 12 దేశాల్లో వైభవోపేతంగా బతుకమ్మ వేడుకలు జరగడం ఈసారి మరో విశేషం. కొత్త జిల్లాలతో కొంగొత రూపు సంతరించుకోబోయే వేళ, బతుకమ్మ వేడుకకు కొత్త హంగు సమకూరింది. కొత్తగా జిల్లా కేంద్రాలు, డివిజన్, మండల కేంద్రాలు కాబోతున్న పట్టణాలుపల్లెల్లో బతుకమ్మ శోభ మరింత తళుకులీనింది.
మా ఊరు జిల్లా కేంద్రం అవుతోందనే ఉత్సాహం మహిళలకు మరింత ఉత్తేజాన్నిచ్చింది. పూల పండుగకు కొత్త పరిమళం అమరినట్టయింది. ఎల్ బి స్టేడియంలో అట్టహాసంగా వేడుకలు జరిగితే, చివరిరోజు ముగింపు వేడుకలకు ట్యాంక్ బండ్ వేదికైంది.
ఇప్పటి వరకు 10 జిల్లాల తెలంగాణలో బతుకమ్మ వేడుకలు జరిగాయి. వచ్చే ఏడాది బహుశా 31 జిల్లాల్లో సంబురాలు అంబరాన్ని అంటుతాయేమో. కొత్త జిల్లాల్లో ఇంకెంత వైవిధ్యభరితంగా వేడుకలు జరుగుతాయో… వేచి చూద్దాం.