పూల పండుగ పరిమళాలతో తెలంగాణ పల్లెలు, పట్టణాలు గుభాళిస్తున్నాయి. రంగు రంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు బతుకులోని ఆనందాన్ని ఆవిష్కరిస్తున్నాయి. పెత్రమాస నాడు మొదలైన బతుకమ్మ సందడితో తెలంగాణ ఆడపడుచులు సంతోష తరంగాల్లో విహరిస్తున్నారు. ఎప్పుడూ ఉండే కష్టాలను మర్చిపోయి ఆటపాటలతో ఆనంద పారవశ్యం పొందుతున్నారు. తమ బతుకులు బాగుండాలని, చల్లంగ చూడమ్మా అని బతుకమ్మకు మొక్కుకుంటున్నారు. బతుకమ్మ పండుగను ఘనంగా జరపడానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎలాగూ ఉంది. సచివాలయం, హైకోర్టు ఆవరణ సహా అనేక కార్యాలయాల్లో కూడా బతుకమ్మ సంబరం అంబరాన్నంటుతోంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో సారి వచ్చిన బతుకమ్మ పండుగ ఇది. పల్లెల్లో ఎటు చూసినా కనిపించే తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో సాయంత్రం నుంచి ఆటపాటల సందడి. రోజంతా పూలను పేర్చడం, అందమైన బతుకమ్మను సిద్ధం చేయడం ఓ అపురూపమైన పని. వివిధ సంస్థలు కూడా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి.
కేసీఆర్ కుమార్తె కవిత తెలంగాణ జాగృతి పేరుతో ఈ ఏడాది కూడా రోజుకో జిల్లాలో బంగారు బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈసారి ముంబైలో కూడా బంగారు బతుకమ్మ సంబరాలు జరపనుండటం విశేషం. ఆదివారం నాడు ముంబైలో జరిగే బంగారు బతుకమ్మ వేడుక, అక్కడ స్థిరపడ్డ తెలంగాణ మహిళలకు ఓ తీపి గురుతు కాబోతుంది. ఈనెల 20 హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై సద్దుల బతుకమ్మ వేడుకతో బంగారు బతుకమ్మ సంబరాలు ముగుస్తాయి. అదే రోజు పల్లె పల్లెలో, గల్లీ గల్లీలో సద్దుల బతుకమ్మ సందడి నెలకొంటుంది. పోయిరా బతుకమ్మా, వచ్చే ఏడాది మళ్లీ రా బతుకమ్మా అంటూ వాగుల్లో, చెరువుల్లో బతుకమ్మను నిమజ్జనం చేసి సాగనంపుతారు.
ఆ తర్వాత రెండు రోజులకే దసరా పండుగ. తెలంగాణ ప్రజలకు దసరా సరదాల సంరంభం అందమైన అనుభవం. దసరా ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురు చూస్తూ, ఎక్కడెక్కడో స్థిరపడ్డ వారూ సొంతూరు బాట పడతారు. ఇప్పటికే చాలా మంది సొంతూరికి చేరిపోయారు. దసరా సీజన్ సంబరాల మజాను ఆస్వాదిస్తున్నారు.