తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్మించుకున్న సీఎం క్యాంప్ కార్యాలయం ప్రగతి భవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గృహప్రవేశం చేశారు. అక్కడ ఇంకో భవనం ఖాళీగా ఉంది. ఆ భవనాన్ని మరో మంత్రికి కేటాయిస్తామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఇప్పటికే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఓ భవనంలో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. అది అక్కడ కంటిన్యూ అవుతుంది.
ప్రగతి భవన్ లో కి గతంలో చీమ కూడా అనుమతి లేకుండా దూరేది కాదు. కనీసం లోపల భవనాలు ఎలా ఉన్నాయో ఫోటోలు కూడా బయటకు రాలేదు. కానీ ఇప్పుడు నేరుగా ప్రజలు వెళ్తున్నారు. ప్రజాభవన్‌గా మార్చిన ప్రభుత్వం… ప్రజావాణి నిర్వహిస్తోంది. అక్కడ నివాసాలను ఎలా ఉపయోగించాలన్నదానిపై చర్చించుకుని చివరికి మంత్రులకు కేటాయించాలని నిర్ణయించారు. ప్రగతి భవన్ లో గతంలో ఓ సారి.. దళిత బంధు పథకం గురించి చర్చించడానికి వెళ్లి ఆతిథ్యం తీసుకున్న భట్టి విక్రమార్కకు ఆ వైభవం మనసులో ముద్రపడిపోయి ఉంటుంది. ఇప్పుడు చాన్స్ రాగానే ఆ ఇల్లు తనకు కేటాయించాలని కోరారు. ఆయన మాటను రేవంత్ కాదనలేదు.
నిజానికి బేగంపేటలో ప్రగతి భవన్ కంటే ముందు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఓ భవనం నిర్మించారు. వైఎస్ చనిపోయాక చాలా కాలం ఆ ఇంట్లో ఆయన కుటుంబమే ఉంది. తప్పనిసరిగా ఖాళీ చేయాల్సి వచ్చింది. తర్వాత సీఎం కిరణ్ ఉపయోగించుకున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఇంటి నుంచి పాలన చేశారు. కానీ అది సరిపోనందున.. ఆ ఇంటి వెనుకాల ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ల క్వార్టర్లు కూల్చేసి… భారీగా ప్రగతి భవన్ నిర్మించుకున్నారు. ఇప్పుడు ఆ ప్రగతి భవన్ నివాసాలతో పాటు… వైఎస్ నిర్మించిన ఇల్లు కూడా మంత్రులకు కేటాయిస్తారు.