ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా మాట్లాడుతున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లన్నీ గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలేననీ, అవే వాళ్లు అడుగుతూ సమ్మెకి దిగారనీ, కానీ ప్రతిపక్షాల ప్రోత్సాహం వల్లనే సమ్మెకి దిగి ప్రాణాలు కోల్పోయారంటూ సీఎం వ్యాఖ్యానించడం సబబు కాదన్నారు. కార్మికుల డిమాండ్లు సహేతుకమైనవి కాబట్టి, వారి సమస్యల్ని మానవీయ కోణంలో అర్థం చేసుకుని ప్రతిపక్షాలు మద్దతు ఇస్తున్నాయన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఆర్టీసీ సంస్థనీ, ఆస్తుల్నీ గత ప్రభుత్వాలు కాపాడుకుంటూ వచ్చి తెలంగాణకు అందించాయన్నారు. ఇప్పుడీ ప్రజల ఆస్తుల్ని అమ్మేస్తాననీ, ప్రైవేటుపరం ఎలా చేస్తారని ప్రశ్నించారు.
ప్రభుత్వరంగ సంస్థగా ఆర్టీసీ నడిస్తేనే తక్కువ ధరలకు మెరుగైన రవాణా సదుపాయాలు ప్రజలకు లభిస్తాయన్నారు భట్టి. కార్మికుల సమ్మె ఒక అంశమనీ, రూట్లు ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం మరో అంశమన్నారు. కార్మికుల సమ్మెకు పరిష్కారం చూపించకుండా, రూట్లను ప్రైవేటుపరం చేస్తే పనైపోతుందన్నట్టు వ్యవహరిస్తే ఎలా అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని పెట్టింది లాభాపేక్ష కోసం కాదనీ, నష్టాలొస్తే మూసేసి ఎవరికో అమ్మేయాలనేది ప్రభుత్వ రంగ సంస్థల స్థాపన వెనక ఉద్దేశం కాదన్నారు. ప్రజల అవసరాలు తీరేందుకు కావాల్సిన వసతులు కల్పించడంతోపాటు, ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించడం ఈ సంస్థల ముఖ్యోద్దేశం అన్నారు. సొమ్ము చేసుకోవడం కోసం ఆర్టీసీ పెట్టలేదనీ, దాన్లో సేవాభావం కూడా ఉందన్నారు. ఆర్టీసీతో మొదలైన ఈ అమ్మకాలు ఇక్కడితో ఆగవనీ, రేప్పొద్దున్న సింగరేణి భూములు, హైదరాబాద్ లో ఉన్న విలువైన ఆస్తులు, ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీళ్లను కూడా అమ్మేస్తారనీ, దీనిపై ప్రజలంతా ఆలోచించాలన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి కార్మికులను చర్చలకు పిలవాలన్నారు. రూట్లను ప్రైవేటు సంస్థలకు ఇచ్చేస్తున్నామని ప్రకటిస్తే చూస్తూ ఊరుకోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరన్నారు.
భట్టి విక్రమార్క మాటల్లో ఇదైతే వాస్తవం. కాకపోతే ఈరకంగా చర్చే జరగడం లేదు! ప్రభుత్వ రంగ సంస్థల్ని లాభాలొస్తేనే నడపాలీ, నష్టాలొస్తే ప్రైవేటుపరం చేసేయాలనే ఆలోచనాధోరణి కచ్చితంగా మంచిది కాదు. ప్రజా రవాణా అనేది సేవారంగం అవుతుంది. విద్య, వైద్యం ఎలాగో ప్రజా రవాణా కూడా అలాగే చూడాలి. ఆయా రంగాలకు ప్రతీయేటా బడ్జెట్ లో కేటాయింపుల్ని ప్రభుత్వానికి అవుతున్న అదనపు వ్యయంగానో, భారంగానో భావిస్తే ఎలా..?