నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలోనే విడుదల. అయితే… ఇప్పటి వరకూ సినిమా టైటిల్ ఏమిటన్నది చెప్పలేదు. బయట చాలా టైటిళ్లు చక్కర్లు కొడుతున్నాయి. అందులో `మోనార్క్` అనే పేరు బలంగా వినిపిస్తోంది. అయితే.. అవేం కాకుండా ఓ కొత్త పేరు పెట్టాలన్నది బోయపాటి తాపత్రయం. అందుకే ఇంత వరకూ టైటిల్ ప్రకటన ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు ఈ టైటిల్ విషయంలో చిత్రబృందం ఓ నిర్ణయానికి వచ్చేసింది. టైటిల్ ప్రకటనకు ముహూర్తం కూడా నిర్ణయించేసింది.
ఏప్రిల్ 13న ఉగాది. ఆ రోజు..మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషాలకు ఈ సినిమా టైటిల్ ని ప్రకటించబోతున్నారు. శ్రీకాంత్ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ కథానాయిక. పూర్ణ ఓ కీలకపాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఆఘోరాగా కనిపించనున్నారని ప్రచారం జరిగింది. అయితే.. ఇప్పుడు ఆ పాత్ర రూపు రేఖల్ని పూర్తిగా మార్చేశారు. ఉగాదిన బాలయ్యకు సంబంధించిన రెండో లుక్ కూడా బయటకు వచ్చే ఆస్కారం ఉంది.