బాలకృష్ణ – బోయపాటి శ్రీను.. ఈ కాంబోకున్న స్పెషాలిటీనే వేరు. సింహా, లెజెండ్, అఖండ.. ఒకదాన్ని మించి మరోటి విజయం అందుకొన్నాయి. ఇప్పుడు ఈ జోడీ నుంచి నాలుగో సినిమా రాబోతోంది. ‘అఖండ’ కథకు ఇది కొనసాగింపు. అయితే బోయపాటి మాత్రం ఈ సినిమాకు ఓ కొత్త టైటిల్ ప్రకటించబోతున్నాడు. రేపు హైదరాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రేపే టైటిల్ ప్రకటిస్తారు. మోషన్ పోస్టర్ కూడా విడుదల చేస్తారు. ఈ చిత్రానికి ‘తాండవం’ అనే పేరు పెట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
‘అఖండ’లో మాస్, యాక్షన్, హీరోయిజం ఇవన్నీ బాగా పండాయి. దానికి తోడు హిందుత్వం అనే ఎలిమెంట్ కూడా తోడైంది. దేవాలయాల పరిరక్షణ, వాటి విశిష్టత గురించి ‘అఖండ’లో చెప్పారు. ఇప్పుడు ఆ పాయింట్ ని మరింత విస్కృతంగా చర్చించబోతున్నట్టు సమాచారం. బాలయ్య ప్రస్తుతం బాబీతో ఓ సినిమా చేస్తున్నారు. డిసెంబరు వరకూ ఈ షూటింగ్ ఉంది. అయితే మధ్యమధ్యలో బోయపాటికి కూడా కొన్ని డేట్లు ఇస్తున్నారని తెలుస్తుంది. డిసెంబరులోగా ఒక షెడ్యూల్ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడు బోయపాటి.