హైదరాబాద్: 25 బీసీ సంఘాల నాయకులు ఇవాళ విజయవాడలో సమావేశమయ్యారు. కాపులను బీసీల్లో చేర్చటాన్ని వ్యతిరేకిస్తున్నామని హెచ్చరించారు. కాపులను బీసీల్లో చేర్చటానికి కమిషన్ వేసే అధికారం అసలు ప్రభుత్వానికి లేదని చెప్పారు. ఒకవేళ చేరిస్తే కోర్టుకు వెళతామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని చెప్పారు. కాపులు అన్నిరకాలుగా ముందున్నారని అన్నారు. ఆర్థికంగా, సామాజికంగా స్థిరపడ్డారని చెప్పారు. కాపు గర్జనలు రాజ్యాధికారంకోసమని, రిజర్వేషన్లకోసం కాదని అన్నారు. బీసీల్లో చేర్చాల్సిన అవసరం లేదని చెప్పారు. చట్టాలు కూడా ఒప్పుకోవని అన్నారు. వారిని బీసీల్లో చేర్చితే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కూడా సిద్ధమని హెచ్చరించారు.
మరోవైపు బీసీ సంఘాల నాయకుడు, తెలుగుదేశం ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ, ఈ నెల 5వ తేదీన కాపులను బీసీల్లో చేర్చటానికి వ్యతిరేకంగా ఏపీలో కలెక్టరేట్లను ముట్టడిస్తామని తెలిపారు. 5 శాతం ఉన్న కాపులు ఒక్క రైలు దగ్ధం చేస్తేనే అన్ని పార్టీలూ స్పందిస్తున్నాయని, 55 శాతం ఉన్న బీసీలు తిరగబడితే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలని అన్నారు. కాపులకు ఎన్ని నిధులు మంజూరు చేసినా తమకు అభ్యంతరం లేదని, బీసీల్లో చేరిస్తే మాత్రం ఊరుకోమని చెప్పారు.