తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. విజేతలు నిర్ణయమయ్యారు. ప్రభుత్వం ఏర్పడుతుంది. కానీ సామాజిక న్యాయం అనేది తెలంగాణలో రాను రాను ఓ అంటరాని పదంగా మారుతోంది. దానికి సాక్ష్యం ఎన్నికైన ఎమ్మెల్యేలే. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. అందులో 43 మంది రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేలే. బీసీ వర్గాల నుంచి గెలిచింది కేవలం 19 మంది. ఇప్పుడీ లెక్కలు తెలంగాణలో సామాజిక అసమతుల్యాన్ని ప్రజలకు పరిచయం చేస్తున్నాయి.
రిజర్వుడు సీట్లు పోను సగానికిపైగాసీట్లలో రెడ్డి ఎమ్మెల్యేలు
తెలంగాణలో 43 మంది రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేలు అన్ని పార్టీల నుంచి గెలిచారు. 119 అసెంబ్లీ నియోకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు సీట్లు 31. అలాగే పాతబస్తీ అన్నీ జనరల్ కేటగరిలోకి వస్తాయి. ఇక్కడ ఏడు సీట్లలో ముస్లింలను మాత్రమే మజ్లిస్ నిలబెడుతుంది. ఇప్పటికైతే వాళ్లే గెలుస్తారు. గెలిచారు. అంటే. 38 ఎస్సీ, ఎస్టీ , ముస్లిం వర్గాలను తీసేస్తే జనరల్ కోటాలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు 81. ఇందులో 43 మంది రెడ్డి సామాజికవర్గాల నేతలు. వీరి లెక్క చూసిన తర్వాత బీసీ వర్గాల్లో అసంతృప్తి పెరగకుండా ఎలా ఉంటుంది.
బీసీ వర్గాలకు భారీగా టిక్కెట్లు ఇస్తామని మాట తప్పిన పార్టీలు
తెలంగాణలో బీసీ వర్గాలకు టిక్కెట్లు ఇస్తామని చెప్పి అన్ని పార్టీలు మోసం చేశాయి. విజేతగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో బీసీలకు రెండు స్థానాలు కేటాయిస్తామని ప్రకటించింది. అంటే.. 36 సీట్లు ఇవ్వాలి. తీరా పూర్తి జాబితా బయటకు వచ్చే సరికి ఆ సంఖ్య 19కి తగ్గిపోయింది. అందులో కొంత మంది గెలిచారు.. కొంత మంది ఓడిపోయారు. మొత్తం అన్ని పార్టీల నుంచి గెలిచిన బీసీ ఎమ్మెల్యేల సంఖ్య 19కి పరిమితమయింది. సగం మందికిపైగా బీసీలు ఉండే .. తెలంగాణ సమాజంలో పదిహేను శాతం ఎమ్మెల్యేలు కూడా బీసీ వర్గాల వారు లేకపోవడం ఆ వర్గాల వారిలో చర్చకు దారి తీస్తోంది.
13 మంది వెలమ ఎమ్మెల్యేలు
రెడ్లు ఎమ్మెల్యేల్లో సింహబాగం ఉండగా.. వెలమ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు 13 మంది విజయం సాధించారు. వీరు తెలంగాణ జనాబాలో మూడు, నాలుగు శాతం మాత్రమే ఉంటారు. అయినా వారికి రాజకీయ పార్టీల భారీగా టిక్కెట్లు కేటాయించాయి. గెలిచారు కూడా. ఎన్నికలు వెలమ వర్సెస్ రెడ్డి అన్నవాతావరణాన్ని తీసుకు వచ్చారు.
టీడీపీ హయాంలో బీసీలకు తెలంగాణలో స్వర్ణయుగం
తెలంగాణలో తెలుగుదేశం ఏర్పటు తర్వాత బీసీలకు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో దిగ్గజ బీసీ నేతలుగా ఉన్న వారందరూ.. టీడీపీ నుంచి వచ్చిన వారే. గతంలో టీడీపీ వారికి భారీగా సీట్లు కేటాయించేది. ఇతర పార్టీలు కూడా తప్పక కేటాయించాల్సి వచ్చింది. 1999లో తెలంగాణ నుంచి ఏకంగా 26 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత .. తెలంగాణలో బీసీల ప్రాధాన్యం తగ్గుతూ వస్తోంది. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావ చూపించగల బీసీ నాయకుడు లేరు. అలాగే బీఆర్ఎస్ లోనూ లేరు. గతంలో దేవేందర్ గౌడ్ సహా పలువురు నేతలు ఉండేవారు. అందరూ వెనుకబడిపోయారు.
రాజకీయ పార్టీలు సామాజిక న్యాయం పాటించకపోతే బీసీల్లో ఉద్యమం వచ్చే చాన్స్
ప్రధాన రాజకీయ పార్టీలు సామాజిక న్యాయం పాటించకపోతే బీసీ వర్గాలు ఏకమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ బీసీ సీఎం నినాదంతో తెర ముందుకు వచ్చింది. గతం కన్నా మెరుగైన సీట్లు సాధిస్తుంది. ఎప్పుడూ అదికారం అయితే వెలమ.. కాదంటే రెడ్డి వర్గాలకేనా.. బీసీలకు వద్దా అన్న ఆలోచనతో బీసీలంతా సమైక్యంగా రోడ్డెక్కితే రాజకీయ పార్టీలకు గడ్డు పరిస్థితి ఎదురవుతుంది. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు వారికి రాజకీయంగా న్యాయం చేస్తే మంచిదన్న అభిప్రాయం వినిపిస్తోంది.