తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. పార్టీ పెద్దలు రాజకీయ వ్యూహాల ప్రకారం కొన్ని చర్యలు తీసుకుంటే వాటిని తమ పార్టీకి అన్వయించేసి మార్పులు చేయాలని అడిగేవారు బయలుదేరుతారు. సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేసి.. బీసీ వర్గాలకు రిజర్వేషన్లు పెంచుతామని అంటున్నారు. ఈ క్రమంలోని కాంగ్రెస్ లోని వర్గాలు బీసీ సీఎం అనే నినాదాన్ని ఇప్పుడే నిజం చేస్తే బీసీలంతా మన వైపే ఉంటారని హైకమాండ్ కు చెప్పడం ప్రారంభించారు. కొంత మంది బీసీ నేతలు లాబీయింగ్ కూడా చేసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
రేవంత్ రెడ్డి కూడా బీసీ సీఎం నినాదానికి సానుకూలంగానే ఉన్నారు కానీ..తనను తీసేసి కాదు. తన తర్వాత అంటున్నారు ఆయన. ఆయన తర్వాత బీసీ సీఎం అవుతారో లేదో కానీ.. ఏఐసీసీ నుంచి వచ్చిన నేతలు మాత్రం.. వచ్చే ఐదేళ్లు సీఎంగా రేవంతే ఉంటారని.. బీసీ సీఎం నినాదానికి తాము వ్యతిరేకం కాదంటున్నారు. కులగణన చేసి బీసీలకు రిజర్వేషన్లు పెంచి.. బీసీల చాంపియన్లం అయితే ఇక ఎన్నికల్లో తిరుగు ఉండదని రేవంత్ అనుకుంటూంటే.. ఆయన వ్యతిరేకులు మాత్రం మరో దారిలో వెళ్తున్నారు.
రేవంత్ రెడ్డి పీఠానికి ఇప్పుడల్లా వచ్చే సమస్య లేదు. బీసీని సీఎంను చేస్తామన్న హామీని కాంగ్రెస్ ఇవ్వలేదు. అయితే వచ్చే ఎన్నికల నాటికి ఇస్తారేమో తెలియదు.గత ఎన్నికల్లో బీజేపీ ఇచ్చింది. కానీ ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ ను కూడా బీసీని నియమించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీలో బీసీ సీఎం నినాదం ఇప్పటికిప్పుడు తేలిపోయినా.. భవిష్యత్ లో అదో పెద్ద నినాదం అయినా ఆశ్చర్యం ఉండదు.