ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీల కోసం 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తోంది. ప్రతీ బీసీ కులానికి కార్పొరేషన్ పెడతామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. మొత్తం 139 బీసీ కులాలు ఉండగా.. వాటికి 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా కార్పొరేషన్లను కంపెనీల చట్టం కింద నమోదు చేస్తారు. ఇలా చేయడం వల్ల.. అవి స్వతంత్రంగా పని చేయడానికి అవకాశం ఉంటుంది. తమ తమ కులాల యువతకు రుణాలు ఇచ్చి… వివిధ పద్దతుల్లో ఆదుకుని వారిని ఆర్థికంగా.. సామాజికంగా పైకి తీసుకు రావడానికి ఉపయోగం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న బీసీ కార్పొరేషన్లను సొసైటీలు, స్వచ్ఛంద సంస్థలుగా రిజిస్టర్ చేసింది ప్రభుత్వం.
సొసైటీలు, స్వచ్చంద సంస్థలుగా రిజిస్టర్ చేయడం వల్ల.. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా డిమాండ్ చేసే అవకాశం లేదు. పైగా ఎక్కడా ఈ కార్పొరేషన్ల ద్వారా ఆయా కులాల పేదలకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పడం లేదు. అందరికీ ఇచ్చే పథకాల్లో భాగంగా పంచే సొమ్మును.. ఈ కార్పొరేషన్ల కింద చూపిస్తారు అంతే. అంటే అమ్మఒడికి ఓ బీసీ కులానికి చెందిన కుటుంబానికి సాయం చేస్తే.. ఆ కులం కార్పొరేషన్ ఖాతాలో వేస్తారన్నమాట. భవిష్యత్ లో రేషన్ కూడా.. ఇదే కార్పొరేషన్ లెక్కలో వేసి ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.
పార్టీ నేతలకు పదవులు కల్పించడానికి ఈకార్పొరేషన్లు పెట్టారనే విమర్శలు వస్తున్నాయి. పోనీ ఈ పదవులు వారికైనా ఉపయోగపడతాయా అంటే.. ఆ పేరు చెప్పి దందాలు చేసుకోవడానికి తప్పప్రయోజనం ఉండదు. సొసైటీలు, స్వచ్ఛంద సంస్థల కేటగిరిలో రిజిస్టర్ చేయడం వల్ల వీటి అధ్యక్షుడు, చైర్మన్ జీతం తీసుకునే అవకాశముండదు. అంతే కాదు..అనేక నిబంధనలు ఉన్నాయి. ఈ కార్పొరే్షన్ల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. పలువురు బీసీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.