వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకం తర్వాత ఏర్పడిన అసంతృప్తి ఇంకా చల్లారలేదు. మంత్రి పదవులు ఆశించిన కొంత మందిని… సీఎం జగన్మోహన్ రెడ్డి.. ప్రత్యేకంగా పిలిచి మాట్లాడిన తర్వాత… కొంత మంది సర్దుకున్నారు. మరికొంత మంది పిలిచినా…జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లలేదన్న ప్రచారం జరుగుతోంది. అలాంటివారిలో ముఖ్యంగా వినిపిస్తున్న పేరు… కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి. ఆయన పార్టీలో తనకు అన్యాయం , అవమానం జరిగిందన్న భావనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
కొలుసు పార్థసారధి కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ నేత. ఆయన తండ్రి కూడా.. రాజకీయ ఉద్దండునిగా పేరు తెచ్చుకున్నారు. తండ్రి అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన పార్థసారధి.. టీడీపీకి పెట్టని కోట లాంటి కృష్ణా జిల్లా నుంచి బలమైన నేతగా ఎదిగారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా కూడా చేశారు. కృష్ణా జిల్లా నుంచి వైసీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరించారు. అదే సమయంలో.. బీసీ వర్గాల్లో బలమైన యాదవ సామాజికవర్గానికి చెందిన నేత. దాంతో… అటు సీనియార్టీ.. ఇటు సామాజికవర్గం… అన్నీ కలసి వస్తాయని మంత్రి పదవి గ్యారంటీ అని ఆశ పెట్టుకున్నారు. కానీ.. చివరికి కృష్ణా జిల్లా నుంచి కొడాలి నానికి… వెల్లంపల్లి శ్రీనివాస్‌కు పదవులు దక్కాయి. వెల్లంపల్లి శ్రీనివాస్.. ఎన్నికలకు కొన్ని నెలల ముందే.. వైసీపీలో చేరారు. టిక్కెట్ తెచ్చుకుని మంత్రి అయిపోయారు. తాను గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఆర్థికంగా నష్టపోయినా.. ఐదేళ్ల పాటు పార్టీని అంటి పెట్టుకుని పని చేసినా.. తనకు గుర్తింపు దక్కలేదన్న అసంతృప్తిలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో.. ఆయన తనకు.. విప్ పదవి ఇచ్చి అవమానించారన్న భావనలో ఉన్నారు. చీఫ్ విప్ పదవిని.. గడికోటశ్రీకాంత్ రెడ్డికి ఇచ్చిన సీఎం జగన్.. ఎనిమిది మంది విప్లలో ఒకరిగా కొలుసు పార్థసారధిని నియమించారు. కానీ పార్ధసారధి విప్ పదవిని తీసుకోవడానికి నిరాకరించారు. దాంతో.. ఆయనను మూడు రోజులకే విప్ పదవి నుంచి తొలగిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది. కొత్తగా ముగ్గుర్ని నియమించింది. ఇప్పటికే పలువురు సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. వారందరికీ.. రెండున్నరేళ్ల తర్వాత చాన్స్ వస్తుందని… జగన్ బుజ్జగిస్తున్నట్లు చెబుతున్నారు. మరి పార్థసారధికి అలాంటి హామీ ఏమైనా వచ్చిందో రాలేదో మరి..!