వైఎస్ జగన్ కేబినెట్లో మంత్రులందరూ రాజీనామాలు చేయబోతున్నారు. వారిలో ఇటీవల పదవులు చేపట్టిన బీసీ నేతలు చెల్లు బోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు వంటి వారు కూడా ఉండనున్నారు. మొదటి నుంచి పదవిలో ఉన్న బీసీ నేతలుకూడా ఉన్నారు. అందరి పదవులు ఊడనున్నాయి. ఇది మైనస్ అవుతుందేమో అనుకుంటున్న వైసీపీ హైకమాండ్ వినూత్నమైన ఆలోచన చేసింది. మాజీలయ్యే బీసీ మంత్రులతోనే.. బీసీలకు జగన్ రెడ్డి సర్కార్ చాలా చేసిందని ఊరూరా చెప్పే ప్రణాళిక సిద్దం చేసింది.
బీసీ మంత్రులందర్నీ సజ్జల రామకృష్ణారెడ్డి పిలిపించుకున్నారు. పదవులు పోతున్నాయని నేరుగానే చెప్పేశారు. వారిలో చాలా మందికి పార్టీపదవులు కూడా ఇవ్వడం లేదని.. అయితే వాడుకోవడం లేదని అనుకోవద్దనిచెప్పి.. యాత్ర ప్రణాళిక వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ చైతన్య పర్యటనలు, సమావేశాలు నిర్వహించాలని రూట్ మ్యాప్ ఖరారు చేశారు. బీసీలకు సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు, జరిగిన మేళ్లను ప్రజలకు చెబుతామని మాజీలు కాబోయే ప్రస్తుత బీసీ మంత్రులు చెబుతున్నారు.
బీసీల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తామని చెబుతున్నారు. తొలుత అన్ని కొత్త జిల్లాల్లో బీసీ ప్రాంతీయ సదస్సులు అనంతరం రాష్ట్ర స్థాయిలో బీసీ సదస్సు నిర్వహించనున్నారు. ఏప్రిల్ నెల 15 తర్వాత నెల పాటు పర్యటనలు చేయాలని నిర్ణయించారు. అప్పటికి వీరంతా మాజీలవుతారు. కొత్త బీసీ మంత్రులు వస్తారు. అప్పుడు వీరిని పట్టించుకునేవారు కూడా ఉండరు. అయినప్పటికీ వారికి అసంతృప్తి లేకుండా చేయాలని.. వారికి అన్యాయం చేశారన్న వాదన ప్రజల్లోకి వెళ్లకుండా.. వారితోనే జగన్కు పొగడ్తలు కురిపించాలని భారీ ప్రణాళిక సిద్ధం చేసేశారు.