ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ ఉత్తర్వు జారీ చేసింది. దాని ప్రకారం.. నెలవారీగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇచ్చే సామాజిక పెన్షన్లను..వారు ఏ వర్గానికి చెందుతారో.. ఆ వర్గానికి చెందిన సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా ఇస్తారు. అంటే.. బీసీలు అయితే బీసీ కార్పొరేషన్… ఎస్సీలు అయితే ఎస్సీ కార్పొరేషన్.. ఎస్టీలు అయితే..ఎస్టీ కార్పొరేషన్ ఇస్తున్నట్లుగా ఇస్తారు. మిగతా వర్గాల వారికి వారికి ఉన్న కార్పొరేషన్ల ద్వారా ఇస్తారు. అంటే ప్రభుత్వం కార్పొరేషన్లకు నిధులు కేటాయిస్తుంది. వాటిని కార్పొరేషన్ల ద్వారా లబ్దిదారులకు అందచేస్తారు. రెండు రోజుల కిందట విడుదల చేసిన రూ. నాలుగు వేల కోట్ల ఫీజు రీఎంబర్స్ డబ్బుల్ని కూడా నేరుగా ప్రభుత్వం విడుదల చేయలేదు. ముందుగా.. ఆయా కార్పొరేషన్లకు కేటాయించి… ఆ తర్వాత ఆ నిధులను ఫీజు రీఎంబర్స్‌మెంట్‌కు బదిలీ చేసింది. గతంలో అమ్మఒడి పథకానికీ అంతే.
నిజానికి ప్రభుత్వాలు వివిధ వర్గాల వారికీ కార్పొరేషన్లు పెట్టిన లక్ష్యం వేరు. ప్రజలను తమ కాళ్ల మీద తాము నిలబడేలా ప్రోత్సహించడాన్ని ప్రాథమిక లక్ష్యంగా పెట్టుకుంటాయి. అందుకే విభిన్న రకాల స్వయం సహాయక కార్యక్రమాలు, ఉపాధి పథకాలు, రుణాలు అందిస్తూ.. మహిళలు, యువతకు ప్రత్యేకంగా సాయం చేస్తూంటాయి. ఇందు కోసం.. వివిధ రకాల కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. వాటికి బడ్జెట్లో ప్రత్యేకంగా కొంత కేటాయించి.. ఆయా వర్గాల ప్రజలకు రుణాలు అందించడం ద్వారా.. వారి అభ్యున్నతికి సాయం చేస్తున్నారు. ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, బీసీ సబ్ ప్లాన్ వంటి వాటిని ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.
గత ప్రభుత్వంలో కాపు కార్పొరేషన్‌కు ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తే.. ఇందులో అత్యధికంగా.. ఆ వర్గం యువత వ్యాపారాలు చేసుకోవడానికి.. .ఉపాధి పొందడానికి రుణాలు అందించారు. ఇప్పుడు.. వైసీపీ ప్రభుత్వం గత ఏడాది బడ్జెట్లో రూ. రెండు వేల కోట్లు కేటాయించినా.. ఎలాంటి రుణాలు మంజూరు చేయలేదు. ఒక్క కాపు కార్పొరేషన్‌కు మాత్రమే కాదు.. అన్ని కార్పొరేషన్లలోనూ ఇదే పరిస్థితి. కొంత మొత్తం కేటాయించి.. ఆ మొత్తాన్ని..వివిధ పథకాలకు మళ్లించేశారు. ప్రతీ కులానికి ఓ కార్పొరేషన్ పెట్టి.. ఆ కార్పొరేషన్‌కు దండిగా నిధులు కేటాయించి… అందులో ఉన్న యువతను ఆర్థికంగా పైకి తీసుకు వచ్చే బాధ్యత తాను తీసుకుంటానని.. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభల్లో చెప్పారు. తీరా ఇప్పుడు ఆయా వర్గాల వారికి వివిధ పథకాల కింద చేస్తున్న సాయం అంతా.. కార్పొరేషన్ల లెక్కల్లోనే వేస్తున్నారు. ఫలితంగా ఆయా వర్గాల యువతకు కార్పొరేషన్లు అండగా నిలబడే పరిస్థితి లేకుండా పోయింది.