భారతీయ క్రికెట్ కు బద్ధ శత్రువు ఎవరంటే క్రికెట్ బోర్డే. క్రీడా స్ఫూర్తి అనేది దాని డిక్షనరీలోనే లేదు. డబ్బు యావ తప్ప ఆటను మెరుగుపరచాలనే ఆలోచన లేదు. ఏం చేస్తే ఎంత డబ్బొస్తుందనేదే బోర్డు పెద్దల ధ్యాస. శ్రీనివాసన్ జమానాలో నీచాతి నీచంగా భ్రష్టు పట్టిన బోర్డు, ఇప్పుడైనా కాస్త సరిగా పని చేస్తుందనుకుంటే ఆ సూచనలు కనిపించడం లేదు. భారతీయ క్రికెట్ కు బీసీసీఐ పీడ ఎంత కాలమని క్రికెట్ ప్రేమికులు బాధపడుతున్నారు. ఐపీఎల్ పేరుతో ఐటం సాంగ్ స్థాయికి ఆటను దిగజార్చిన ఇలాంటి బోర్డు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.
కొత్త అధ్యక్షుడు శశాంక్ మనోహర్ కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వారితో చర్చలకు సై అన్నారు. వారు వచ్చింది భారత్ తో సిరీస్ ఖరారు చేసుకోవడానికి. దేశ భక్తుల పార్టీగా చెప్పుకొనే బీజేపీకి చెందిన ఎంపీ అనురాగ్ ఠాకూర్ బీసీసీఐ కార్యదర్శి హోదాలో పీసీబీ వారితో చర్చలకు సిద్ధపడ్డారు. ఇందులో మనీ మ్యాటర్ తప్ప మరో విషయం లేదు.
ఉగ్రవాదం, చర్చలు ఏకకాలంలో సాధ్యం కాదని మోడీ ప్రభుత్వం ఎప్పుడో పాక్ కు తేల్చి చెప్పింది. దేశ ప్రజల అభిప్రాయం కూడా అదే. ఉగ్రవాదం, క్రికెట్ ఏకకాలంలో సాధ్యం కాదనే. బీసీసీఐ మాత్రం పాక్ సిరీస్ కు సుముఖంగా ఉన్నట్టే కనిపించింది. శివసేన నిరసనతో సీన్ మారినట్టు కనిపిస్తోంది. శివసేన నిరసన తెలిపిన తీరు సరైందా కాదా అనేది పక్కన పెడితే, దేశంలో చాలా మంది శివ సైనికుల అభిప్రాయంతో ఏకీభవించారు. పాక్ తో క్రికెట్ వద్దేవద్దన్న వారే ఎక్కువ.
తాను చట్టానికి, అన్నింటికీ అతీతమని బీసీసీఐ విర్రవీగుతుందనడానికి అనేక ఉదాహరణలున్నాయి. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో అజహరుద్దీన్ కు వ్యతిరేకంగా ఆధారాలు లేవన్న సుప్రీం కోర్టు, ఆయన్ని నిర్దోషిగా తీర్పు చెప్పింది. బీసీసీఐ పెద్దలు మాత్రం అజహర్ పై నిషేధం తొలగించలేదు. ఎందుకు? కోర్టు కంటే బీసీసీఐకే ఎక్కువ తెలుసా? తెలిస్తే కోర్టులో ఎందుకు నిరూపించలేదు? దీనికి బీసీసీఐ నుంచి జవాబు లేదు.
మరోవైపు, ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు దోషులని తేలింది. సాక్షాత్తూ సుప్రీం కోర్టు నియమించిన కమిటీ ఈ రెండు జట్లనూ రెండేళ్ల పాటు నిషేధించింది. కానీ బీసీసీఐ మాత్రం వీటి తప్పుడు పనులకు తన వైపు నుంచి శిక్ష విధించ కూడదని నిర్ణయించింది. రెండేళ్ల తర్వాత వాటిని మళ్లీ ఆడటానికి అనుమతించాలని తీర్మానించింది. ఇదేం నీతి? క్రికెట్ లో అవినీతిని సహించని వ్యక్తిగా పేరున్న శశాంక్ మనోహర్ అధ్యక్షుడైన తర్వాత కూడా బీసీసీఐ రోగం కుదర లేదు. బుద్ధి రాలేదు. దేశ ప్రయోజనాలు, ప్రజల మనోభావాల కంటే పాక్ సిరీస్ తో వచ్చే డబ్బే ముఖ్యమని భావించినట్టున్నారు. శివసేన దాడితో ఈ సిరీస్ కు ఫుల్ స్టాప్ పడుతుందా? ఏమో చూద్దాం.