ఒక్క శాతం ఆత్మవిశ్వాసం కూడా లేని మనుషులు మనకు రాజకీయ నాయకుల్లోనే కనిపిస్తూ ఉంటారు. అందుకే ఎప్పుడూ సక్సెస్ వెంటే పరుగెడుతూ ఉంటారు. సక్సెస్ ఉన్నవాళ్ళకు వంగి వంగి సలాములు చేస్తూ ఉంటారు. పదిమందీ ప్రశంశించే స్థాయి విజయాన్ని ఎవరు సాధించినా వాళ్ళతో కలిసి ఫొటో దిగడానికి, వాళ్ళ నోటి వెంట తన పేరు కూడా వచ్చేలా చేసుకోవడానికి నాయకులు పడే తాపత్రయం అంతా ఇంతా కాదు. గొప్ప గొప్ప విజయాలు సాధించినవాళ్ళ నోట తన పేరు కూడా గొప్పగా వినపడాలన్న ఉద్ధేశ్యంతో భారీగా నజరానాలు ఇస్తూ ఉంటారు. అఫ్కోర్స్…అంతా ప్రజల సొమ్మే అనుకోండి. ఆ విజేతలకు చేసే సన్మాన కార్యక్రమాల సందర్భంగా కూడా మన నాయకుల ప్రవర్తన చాలా సిల్లీగా ఉంటుంది. అలాంటి ఆర్భాటాల విషయంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇంకాస్త ముందడుగు వేసింది.
క్రికెట్ నుంచి దేశభక్తి అనే ట్యాగ్‌ని వేరు చేస్తే ఆ ఆటకు ఉన్న క్రేజ్ అంతా కూడా చాలా తక్కువ టైంలోనే మాయమయిపోతుందనడంలో సందేహం లేదు. అందుకే బిసిసిఐ కూడా క్రికెట్‌ని దేశభక్తికి ముడిపెట్టి ప్రచారం చేయడానికి లక్ష రకాలు ప్రయత్నాలు చేస్తుంది. కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం ఆడే ఐపిఎల్ సందర్భంగా కూడా జాతీయ గీతాన్ని వినిపిస్తుంది. దేశాల మధ్య జరిగే మ్యాచ్ అయినా అయితే ‘ఇండియా గెలిచింది’ అన్న కలర్ ఇవ్వొచ్చు. కానీ ఐపిఎల్ మ్యాచ్‌లను కూడా దేశభక్తితో ముడిపెట్టాలన్న గొప్ప మార్కెటింగ్ ఐడియాలు మాత్రం బిసిసిఐ మార్కెటింగ్ బుర్రలోనే ఉంటాయి. ఈ దేశభక్తి సెంటిమెంట్ అంతా కూడా ప్రజలను నమ్మించడం కోసమే. బిసిసిఐకి సంబంధించిన అన్ని వ్యవహారాలను ఆరా తీయాలనుకున్న సుప్రీం కోర్టు దగ్గర మాత్రం పూర్తి వ్యతిరేక టోన్ వినిపిస్తుంది బిసిసిఐ. ఇండియన్ క్రికెటర్స్ అందరూ బిసిసిఐకి సంబంధించిన వాళ్ళే. భారతదేశానికి ఆ క్రికెట్ టీంకి ఏ సంబంధమూ లేదు. అది బిసిసిఐ క్రికెట్ టీం అని చెప్పి చాలా చాలా స్పష్టంగా సుప్రీం కోర్టుకు విన్నవించుకుంది బిసిసిఐ. ఇలాంటి జిత్తుల మారి తెలివితేటలను బోర్డు కాబట్టే కోట్లాది రూపాయలను కొల్లగొడుతోంది. ఆటగాళ్ళకు కూడా ఆ కోట్ల రూపాయలతో పాటు భయంకరమైన క్రేజ్ వచ్చేలా చేస్తోంది. ఇక ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడానికి మన నాయకులు రెడీ అయిపోతున్నారు. టెండూల్కర్‌కి భారతరత్న ఇచ్చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రాజ్యసభ సభ్యుడిని కూడా చేశారు. కానీ రాజ్యసభలో మాత్రం టెండూల్కర్ డకౌట్ అయ్యాడు. జనాలు ఉపయోగపడింది ఏమీ లేదు.
నజరానాలు, పదవుల విషయం అంటే ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోరేమో కానీ ఇప్పుడు విరాట్ కోహ్లికి ఏకంగా వరద బాధిత నిధులు 47.19 కోట్ల రూపాయలను విరాట్ కోహ్లికి చెల్లించింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. ఆర్టీఐ ద్వారా ఆ విషయం బయటపడడంతో అందరూ షాక్ అయ్యారు. కానీ ఉత్తరాఖండ్ ప్రభుత్వం మాత్రం నిస్సిగ్గుగా సమర్థించుకుంటోంది. ఉత్తరాఖండ్ టూరిజం వీడియోలో విరాట్ కోహ్లి కొన్ని నిమిషాలు కనిపించాడట. అందుకని చెప్పి వరద బాధితుల నిధులు తీసుకెళ్ళి విరాట్ కోహ్లికి గిఫ్ట్‌గా ఇచ్చారట. ఇలాంటి నాయకులను ఎలా విమర్శించాలి? ఏమని విమర్శించాలి? వరద బాధిత నిధులను కోటీశ్వరుడైన కోహ్లికి గిఫ్ట్‌గా ఇచ్చినవాడు నాయకుడా? కాదా? అన్న విషయం తర్వాత. అసలు మనిషే అయి ఉంటాడా?