అన్నీ బాగుంటే… ఈపాటికి రసవత్తరమైన ఐపీఎల్ మ్యాచ్‌లకు సాక్ష్యంగా నిలిచేవాళ్లం. వేసవి సెలవల్లో ఐపీఎల్ మంచి వినోదాన్నీ, తీరిక లేని కాలక్షేపాన్ని అందించేవి. కానీ లాక్ డౌన్ వల్ల ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడింది. ఇక ఈ యేడాది ఐపీఎల్ లేనట్టే… అని ఫిక్సయిపోయారు క్రీడాభిమానులు.
అయితే కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గ దర్శకాలు పొట్టి క్రికెట్‌పై మళ్లీ ఆశలు చిగురించేలా చేశాయి. ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించుకునేందుకు అనుమతులు ఇవ్వడంతో… బీసీసీఐలో ఉత్సాహం వచ్చింది. ఇప్పటి నుంచి సన్నాహాలు మొదలెడితే…కనీసం అక్టోబరులో అయినా ఐపీఎల్ ఆట మొదలు పెట్టుకోవొచ్చు. బీసీసీఐ గురి కూడా అక్టోబరుపైనే ఉంది. ఎందుకంటే జూన్ నుంచి వర్షాకాలం మొదలైపోతుంది. ఐపీఎల్ లాంటి మెగా టోర్నీలకు వర్షాలు అడ్డంకి కాకూడదు. అందుకే వర్షాకాలంలో ఈ సీరిస్ జరగే ఛాన్సుల్లేవు. పైగా అంతర్జాతీయ విమానాలు ఎగరడానికి ఇంకొంత సమయం పడుతుంది. అందుకే.. అక్టోబరులో అయితే పూర్తిగా సన్నద్ధం అవ్వొచ్చు.
కాకపోతే… అదే సమయంలో అస్ట్రేలియాలో టీ 20 వరల్డ్ కప్ సిరీస్ జరగబోతోంది. దాన్ని కాదని ఐపీఎల్‌కి ఓటేస్తారా? అనేది చూడాలి. ఐపీఎల్ ఆగిపోతే 4 వేల కోట్ల నష్టం వాటిల్లుతుంది. దాన్ని భరించడానికి బీసీసీఐ సిద్ధంగా లేదు. ప్రపంచ క్రికెట్లో బీసీసీఐ ఆధిపత్యం మామూలుగా ఉండదు. బీసీసీఐ ఎంత చెబితే అంత. అందుకే ఇప్పుడు బీసీసీఐ పెద్దలు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. ముందు ఐపీఎల్, ఆ తరవాత వరల్డ్ కప్ అంటూ షెడ్యూల్ మారుస్తున్నారు. వరల్డ్ కప్ ముందు ఐపీఎల్ జరిగితే ఆటగాళ్లకు ప్రాక్టీసు కూడా ఉంటుందని కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది.
ఐపీఎల్ అయితే రెండు మూడు నగరాల్లో, పరిమితమైన ప్రయాణాల మధ్య ముగించొచ్చు. వరల్డ్ కప్ వ్యవహారం అలా ఉండదు. అందుకే వరల్డ్ కప్ ఈయేడాది ఆడకపోయినా ఫర్వాలేదు, ఐపీఎల్ మాత్రం ఉండాల్సిందే అని బీసీసీఐ పట్టుపడుతోందట. వరల్డ్ కప్ ఆడకపోతే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు భారీ మొత్తంలో నష్టపోతుంది. అయితే ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి సైతం ఓ ప్రత్యామ్నాయ మార్గం ఉంది. జనవరి లో టీమ్ ఇండియా ఆస్ట్రేలియా పర్యటిస్తే… ఆ బోర్డుకు బోలెడంత ఆదాయం. అలా… నష్టాన్ని భర్తీ చేస్తామని బీసీసీఐ భరోసా ఇస్తోందట. అంతర్జాతీయ ఆటగాళ్లు, వాళ్ల క్రికెట్ బోర్డులూ కూడా ఐపీఎల్‌కే ఓటేసే ఛాన్సుంది. ఎందుకంటే ఆయా బోర్డులకు వరల్డ్ కప్ కంటే, ఐపీఎల్ ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తుంది. అక్టోబరు – నవంబరులో ఐపీఎల్, డిసెంబరులో వరల్డ్ కప్ నిర్వహిస్తే ఏ గొడవా ఉండదు. వరసగా నాలుగు నెలలు పొట్టి క్రికెట్ వినోదాన్ని ఆస్వాదించొచ్చు.