బీస్ట్, కేజీఎఫ్ 2.. ఇవి రెండూ ఒక్క రోజు వ్యవధిలో విడుదల కాబోతున్నాయి. ఒకటి విజయ్ సినిమా, మరోటి యశ్ సినిమా. రెండూ క్రేజీ ప్రాజెక్టులే. 13న బీస్ట్ వస్తే, 14న కేజీఎఫ్ 2 వస్తోంది.అయితే ఈ సినిమాలకు సంబంధించి ప్రమోషన్ల హడావుడి అస్సలు లేదు. ఈ రెండు సినిమాల్నీ తెలుగులో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. దాదాపుగా ఓ పెద్ద తెలుగు సినిమాకి ఇచ్చే థియేటర్లు వీటికి దక్కుతున్నాయి. అయినా.. పబ్లిసిటీ చాలా వీక్ గా ఉంది.
కేజీఎఫ్ పాన్ ఇండియా సినిమా. వీళ్ల ప్రమోషన్లు ఏ స్థాయిలో ఉండాలి? కానీ అవేం కనిపించడం లేదు. ఆర్.ఆర్.ఆర్ చూడండి. నెల రోజుల ముందే ప్రమోషన్లు మొదలెట్టారు. దేశమంతా తిరిగారు. కాబట్టే బజ్ రెట్టింపయ్యింది. ఈ సినిమా చూడాలన్న ఉత్సుకత కలిగింది. కేజీఎఫ్ కూడా పాన్ ఇండియా సినిమానే. దానిపై కూడా భారీ అంచనాలున్నాయి. దేశ వ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. కానీ.. ఆ స్థాయిలో ప్రమోషన్లు లేవు. సినిమా చిన్నదా, పెద్దదా అనే తేడా లేదు. ప్రమోషన్లు భారీగా చేయాల్సిందే. కానీ…అది కేజీఎఫ్ విషయంలో కనిపించడం లేదు. కేజీఎఫ్ 1కీ ఇలానే జరిగింది. అసలు అలాంటి సినిమా ఒకటి వస్తుందని కూడా చాలామందికి తెలీదు. తెలుగులో అయితే ప్రమోషన్లే లేవు. దానికి తగ్గట్టు రిలీజ్ రోజున కూడా ఈ సినిమాని ఎవరూ పట్టించుకోలేదు. తర్వాతర్వాత మౌత్ టాక్ వల్ల, పబ్లిసిటీనే అవసరం లేకుండా పోయింది. అలాగని కేజీఎఫ్ 2నీ అదే గాటిన కట్టేయకూడదు కదా?
విజయ్ సినిమాలు తెలుగులో ఈమధ్య బాగానే వసూళ్లు సంపాదించుకుంటున్నాయి. పైగా ఇది మాస్ సినిమా. దానికి తోడు పూజా హెగ్డే కూడా ఉంది. కాబట్టి తెలుగులో మంచి ప్రమోషన్లు చేసుకోవొచ్చు. ఓ తెలుగు ట్రైలర్‌ని వదలడం మినహా.. ఏం చేయలేదు. అది కూడా తమిళ వెర్షన్‌కి డబ్బింగ్ మాత్రమే, తెలుగు కోసం ప్రత్యేకంగా కట్ చేయలేదు.పైగా తమిళం విడుదలైన ఎప్పటికో తెలుగులో వచ్చింది. వ్యవహారం చూస్తుంటే కేజీఎఫ్, బీస్ట్ నిర్మాతల దగ్గర ప్రమోషన్లకు పెట్టుబడి లేదేమో అనిపిస్తోంది. మరో పది రోజుల్లో సినిమా రిలీజ్ కి పెట్టుకొని, ఇంకా నత్తనడక నడుస్తున్నారంటే.. ఆశ్చర్యమే.