పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అధికార పార్టీ తెలుగుదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల నాటికి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పూర్తిచేయాలని లక్ష్యం పెట్టుకుంది. పోలవరం పనులను ఏపీ ప్రజలకు పూర్తిస్థాయిలో అర్థమయ్యే రీతిలో ఇటీవలే అసెంబ్లీలో చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ప్రాజెక్టు పనులు కొంత ఆలస్యం కావడానికి కేంద్రంలోని భాజపా సర్కారు వైఖరే కారణం అన్నట్టుగా టీడపీ నేతలు విమర్శిస్తుంటారు. నిధుల విడుదల విషయంలో కేంద్రం నాన్చుడు ధోరణి అవలంభిస్తోందంటూ భాజపాపై కొన్ని విమర్శలు చేస్తున్న వైనమూ చూస్తున్నాం. ఇదే సందర్భంలో అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ ప్రతిపక్ష పార్టీపై కూడా ఓ ముద్ర వేసే ప్రయత్నం టీడీపీ చూస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు మరో అడుగు ముందుకేసి… పోలవరం ప్రాజెక్టు వ్యయం పెరగడానికి కారణం జగన్ అవినీతే అంటూ ఆరోపించారు ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు.
మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హెలీకాప్టర్ కనిపించకపోయిన రోజునే పోలవరం ఎర్త్ కమ్ డామ్ లకు టెండర్లను జగన్ అప్ లోడ్ చేయించారని మంత్రి దేవినేని ఆరోపించారు. భూసేకరణ వ్యయం అనూహ్యంగా పెరిగిందన్నారు. పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలనీ, దీంతోపాటు స్పిల్ వే, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డామ్ కలిపి టెండర్లు పిలిపిస్తే… దీనిపై ఢిల్లీకీ గల్లీకీ బేరసారాలు కుదరలేదన్నారు. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందన్నారు. ప్రతీరోజూ ఊకదంపుడు ఉపన్యాసాలు దంచుతున్నారనీ, తెలుగుదేశం ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారనీ, మీ నాన్నగారి హెలీకాప్టర్ కనిపించని రోజునే టెండర్లను అప్ లోడ్ చేసింది వాస్తవమా కాదా చెప్పాలంటూ జగన్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని కేసుల్లో కూరుకుపోయారని ఎద్దేవా చేశారు. తమకూ తమ ముఖ్యమంత్రికీ సోమవారం పోలవరం అన్నారు, జగన్ కు శుక్రవారం అంటే కోర్టు వారం, జైలు వారం అంటూ వ్యాఖ్యానించారు. కేసుల్లో ఇరుక్కున్న ప్రతిపక్ష నేతగా తమను విమర్శించే అర్హత జగన్ కి లేదంటూ దేవినేని మండిపడ్డారు.
మొత్తానికి, పోలవరం వ్యయం పెరగడం వెనక జగన్ అవినీతి కారణమంటూ ఓ కొత్త కోణాన్ని బయటకి తెచ్చారు దేవినేని. మరి, దీనిపై జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి. అంతేకాదు, వైకాపా ఆవిర్భానికి కారణం కూడా ఢిల్లీతో బేరం కుదరకపోవడమంటూ వ్యాఖ్యానించడం కూడా విశేషమే. పోలవరం ఆలస్యం కావడానికి భాజపా వైఖరి కారణమంటూనే.. ఇప్పుడు, ఈ ప్రాజెక్టు వ్యయం పెరగడానికి జగన్ అవినీతి కారణమని చెప్పడం మరీ విశేషం. ఖర్చు జగన్ వల్ల పెరిగింది, ఆలస్యం భాజపా వల్ల అవుతోంది, అంతే కదా.