Bedurulanka 2012 Movie Telugu Review
రేటింగ్: 2.25/5
ఆర్ఎక్స్ 100 తర్వాత మళ్ళీ గుర్తుపెట్టుకునే సినిమా కార్తికేయ నుంచి రాలేదు. చేసిన సినిమాలన్నీ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాయి తప్పితే మళ్ళీ బ్రేక్ రాలేదు. మళ్ళీ అలాంటి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న కార్తికేయ ‘బెదురంక’ చేశాడు. ప్రచార చిత్రాలు కొంత ఆసక్తిని రేపాయి. యుగాంతం నేపధ్యంలో సాగే కామెడీ డ్రామా ఇది. ”రేపు వుండదని అన్నప్పుడు.. సమాజం ఏమనుకుంటుందో మనం పట్టించుకోం” అనే ఓ ప్రసిద్ధ డైలాగ్ స్ఫూర్తితో సాగిన బెదురులంక ఎలాంటి వినోదాల్ని పంచింది? కార్తికేయ కోరుకునే మరో విజయం దక్కిందా?
బెదురులంక గ్రామానికి చెందిన కుర్రాడు శివ (కార్తికేయ) హైదరాబాద్లో గ్రాఫిక్స్ డిజైనర్ గా పని చేస్తుంటాడు. ఓ తింగరి క్లైంట్ కారణంగా విసుగొచ్చి ఉద్యగం వదిలేసి సొంత ఊరు వచ్చేస్తాడు. తనకి వూర్లో ఒక లవ్ స్టొరీ వుంటుంది. ప్రెసిడెంట్ (గోపరాజు రమణ) కూతురు చిత్ర ( నేహాశెట్టి) శివ చిన్నప్పటినుంచి ప్రేమించుకుంటారు. కానీ బయటికి చెప్పుకోరు. కట్ చేస్తే అదే సమయం యుగాంతం రాబోతుందని టీవీలో వార్తలు వైరస్ లా బెదురులంక అంతా పాకుతాయి. ప్రపంచం నాశనం అయిపోతుందేమో అని బెదురులంక ప్రజలు భయపడతారు. ఆ భయాన్ని వాడుకొని ప్రజల సొమ్ముని కాజేయాలని పన్నాగం పన్నుతాడు భూషణం(అజయ్ ఘోష్). తప్పుడు జాతకాలు చెప్పే బ్రహ్మం (శ్రీకాంత్ అయ్యంగార్), చర్చి ఫాదర్ కొడుకు డేనియల్(ఆటో రాంప్రసాద్)లని గుప్పెట్లో తీసుకొని యుగాంతం నిజమే అని నమ్మిస్తాడు. యుగాంతాన్ని ఆపాలంటే ఓ పరిష్కారాన్ని కూడా చెప్పిస్తాడు. ప్రజల దగ్గర ఉన్న బంగారాన్ని నిలువుదోపిడీగా దానం చేసి, దానితో శివలింగాన్ని, శిలువను తయారు చేసి గంగలో నిమజ్జనం చేస్తే యుగాంతం ఆగిపోతుందనేది ఈ పరిష్కారం. ప్రెసిడెంట్ ఆదేశంతో ఊరి ప్రజలంతా తమ వద్ద ఉన్న బంగారాన్ని ఇవ్వడానికి సిద్దమౌతారు. అయితే శివ మాత్రం ఎదురుతిరుగుతాడు. దీంతో శివని గ్రామ బహిష్కరణ చేస్తాడు. తర్వాత ఏం జరిగింది? బెదురంక ప్రజలని మోసం చేయాలని చూసిన భూషణం అండ్ గ్యాంగ్ కి శివ ఎలాంటి గుణపాఠం చెప్పాడు? శివ, చిత్ర ప్రేమ ఫలించిందా ? అనేది తక్కిన కథ.
”రేపు వుండదని అన్నప్పుడు.. సమాజం ఏమనుకుంటుందో మనం పట్టించుకోం” సెవెన్ సమురాయ్ సినిమాలోని పాపులర్ డైలాగ్ ఇది. దీనికి ఆధారంగానే ఈ కథని రాసుకున్నానని చెప్పాడు చిత్ర దర్శకుడు క్లాక్స్. ఐతే ఈ కథని చెప్పడానికి మూఢనమ్మకాలు, దేవుడిపేరుతో దోపిడీ చేసేవారిపై ఒక సోషల్ సెటైర్ గా కథనాన్ని మలుచుకున్నాడు. బెదురులం, అక్కడి ప్రజలు , కీలకమైన పాత్రలని ఒకొక్కటిగా పరిచయం చేస్తూ కథలోకి వెళ్లారు. శివ, చిత్రల మధ్య వచ్చిన ప్రేమ సన్నివేశాలు అంత ఆసక్తికరంగా వుండవు కానీ భూషణం, ప్రెసిడెంట్ గారు, బ్రహ్మం, డానియల్ పాత్రల చుట్టూ నడిపే సన్నివేశాలు మాత్రం ఇందులో కీలకంగా మారాయి.
నిజానికి ఈ సినిమాలో హీరో పాత్ర ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు వుండదు. గ్రామంలో ఒక పాత్రలానే వుంటుంది. ఇందులో కథ అన్ని పాత్రల వైపు నుంచి నడుస్తుంది, హీరో పాత్రతో ఈ కథని ఫాలో ఐతే మాత్రం.. కొంచెం నిరాశపడాల్సివస్తుంది. వూర్లో బంగారం సేకరించడంతో కథలోని డ్రామా మొదలౌతుంది. ఆ డ్రామా ఊహించినట్లే సాగుతున్న ప్రెసిడెంట్ గారి తాతల కామెడీ, అలాగే భూషణం, డానియల్, బ్రహ్మం పాత్రలు తొలిసగంలో పర్వాలేదనిపిస్తాయి.
ద్వితీయార్ధంలో కూడా ఇందులో నడపటడానికి కథ పెద్దగా లేదు. అందుకే కథ నుంచి కాకుండా పాత్రల నుంచి వచ్చే వినోదం పైనే ఎక్కువ ఆధారపడ్డాడు దర్శకుడు. ప్రేమకథ కాస్త పేలవంగా వుండటంతో దాని చుట్టూ నడిపిన సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకుకోవు. ఇక దర్శకుడు తను చెప్పదలచుకున్న సందేశం లాంటి పాయింట్ ని క్లైమాక్స్ లో చెప్పాడు. అంతకుముందు శివ బెదురులంక లో సృస్టించిన యుగాంతం సరదాగా వుంటుంది. ఆ క్రమంలో వచ్చే వెన్నెల కిషోర్, సత్య పాత్రలు నవ్విస్తాయి. శివ గ్రాఫిక్ డిజైనర్ వ్రుత్తిని కథలో బాగానే వాడుకున్నాడు దర్శకుడు. క్లైమాక్స్ చాలా సుదీర్గంగా సాగుతున్నప్పటికీ గ్రామంలోని పాత్రలన్నీ ఒకొక్కరు తమ నిజస్వరూపాన్ని బయటపెట్టుకోవడం, ఇక రేపు అనేది లేదన్నప్పుడు మనిషి మానసిక స్థితి చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.
కార్తికేయ శివ పాత్రని సింపుల్ గానే చేసుకుంటూ వెళ్ళాడు. పెద్దగా ఎలివేషన్స్ లేని పాత్ర ఇది. తను కూడా సహజంగానే పాత్రకు తగ్గట్టు కనిపించాడు. ఈ కథకు అవసరం లేదు కానీ తన ఫిజిక్ బావుంది. కొన్ని చోట్ల అవసరం లేకపోయినా దేహ ప్రదర్శన చేసినట్లుకనిపిస్తుంది. నేహాశెట్టి పల్లెటూరి అమ్మాయిలా అందంగా వుంది. తనది కూడా సులువైన పాత్రే. ఇందులో అజయ్ ఘోష్, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్, అటో రామ్ ప్రసాద్ పాత్రలు వినోదాన్ని పంచె బాధ్యతలు తీసుకున్నారు. వారి టైమింగ్ తో ఆకట్టుకున్నారు. కసిరాజు పాత్రలో రాజ్ కుమార్ చివర్లో మంచి వినోదాన్ని పంచాడు. సత్య, వెన్నెల కిషోర్ పాత్రలు నవ్విస్తాయి. ఎల్బీ శ్రీరామ్ పాత్ర కథలోని సారాన్ని చెప్పడానికి ఉపయోగపడింది. గ్రామంలోని ఇంకొన్ని పాత్రలు కూడా అక్కడక్కడ అలరిస్తాయి.
మణిశర్మ మ్యూజిక్ లో మెరుపులు లేవు. గుర్తుపెట్టుకునే మెలోడిస్ చేయడం ఆయన ప్రత్యేకత. ఐతే ఇందులో మళ్ళీ హమ్ చేసుకునేలా ఏ పాటా వుండదు. నేపధ్య సంగీతం మాత్రం పర్వాలేదనిపిస్తుంది. కెమెరాపనితనం డీసెంట్ వుంది. నిర్మాణ విలువకు కథకు తగ్గట్టుగా వున్నాయి. ‘’మనిషి నిజంలో బతికితే జీవితం హాయిగా ఉంటుంది. ప్రతి రోజు చివరి రోజని బతకాలి. దేవుడిపేరుతో మోసపోవద్దు’’ఇలా చాలా సందేశాలు చెప్పేయాలనే తాపత్రయం దర్శకుడిలో కనిపించింది. ఇలాంటి సందేశాలకు వినోదం కూడా కలిసోచ్చుంటే బెదురులంక ఇంకాస్త బెటర్ గా వుండేది.
రేటింగ్: 2.25/5