హైదరాబాద్: జేడీయూ అధినేత శరద్ యాదవ్ ఇవాళ ఉదయం ట్రెండ్స్ ఇంకా పూర్తిగా స్పష్టం కాకముందే మీడియాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు… “ఆవు తోక పట్టుకుని గెలిచేస్తున్నాం” అని. నిజంగానే బీహార్‌లో నితీష్ కూటమి విజయంలో బీఫ్ వివాదం కూడా కీలక పాత్ర పోషించింది. దేశవ్యాప్తంగా గొడ్డు మాంసం తిన్నవారిపై వివిధ ప్రదేశాలలో దాడులు జరిగితే సంఘ్ పరివార్ దానిని సమర్థించటం, ప్రధాని మోడి దానిపై స్పందించకపోవటం, మత అసహనాన్ని వ్యతిరేకించినవారిపై సంఘ్ పరివార్ నేతలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయటం బీహార్‌లో బలమైన ప్రభావం చూపింది. ముస్లిమ్‌లు, యాదవ్‌ల ఓట్లు హోల్‌సేల్‌గా మహాకూటమి ఖాతాలో పడిపోయాయి.
బీహార్‌లో బీజేపీ కూటమి ఓడిపోవటానికి మత అసహనం విషయంలో అవలంబించిన వైఖరి మాత్రమే కాక చాలా కారణాలు ఉన్నాయి. ఓసీ ఓటర్లను ఆకట్టుకోవచ్చనే ఉద్దేశ్యంతో రిజర్వేషన్ విధానాన్ని సమీక్షించాలంటూ సంఘ్ పరివార్ నేతలు చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్ అయినట్లుగా కనిపిస్తోంది. బీహార్‌లో బీజేపీ ఓడిపోతే పాకిస్తాన్లో దీపావళి జరుపుకుంటారని అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కూడా వ్యతిరేక ప్రభావాన్నే చూపాయి. రెండుసార్లు వరుసగా గెలిచి మంచి పరిపాలన అందించినట్లు పేరున్న నితీష్‌ను మోడి దుర్భాషలాడటాన్ని బీహారీలు జీర్ణించుకోలేదని అర్థమవుతోంది. బీహార్‌కు మోడి లక్షా 65 వేల కోట్ల రూపాయల విలువైన ప్యాకేజ్‌లు ప్రకటించినా ఉపయోగం లేకుండా పోయింది. ఆయనకు నిజంగా ప్రేమ ఉంటే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీకి మంచి విజయం అందించినాకూడా – ఈ ఏడాదిన్నర కాలంలో ఏమీ చేయకుండా – అసెంబ్లీ ఎన్నికలముందు వచ్చి ప్రేమ కురిపించటాన్ని బీహారీలు నమ్మలేదు.
మరొకవైపు మోడి, అమిత్ షా ఈ ఎన్నికలలో అంతా తామే అయి చక్రం తిప్పారు. సర్వశక్తులూ ఒడ్డారు. మోడి 27 ప్రచార సభలలో పాల్గొన్నారు. అమిత్ షా తన మంత్రాంగాన్నంతా ప్రయోగించారు. ఈ క్రమంలో ఒక చిన్న విషయాన్ని మర్చిపోయారు. స్థానికంగా ఒక మాస్ లీడర్‌ను కూడా ప్రొజెక్ట్ చేయలేదు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరినీ ప్రకటించకపోవటంకూడా మైనస్ పాయింటే అయింది. కేవలం మోడి ఇమేజ్ మీదే ఆధారపడ్డారు. తననే ముఖ్యమంత్రిగా భావించాలని మోడి బీహారీలకు చెప్పారు. మొత్తం తాను చూసుకుంటానని నమ్మించటానికి ప్రయత్నించారు. అయితే ఆ మాటలను ఓటర్లు నమ్మలేదు. కొసమెరుపేమిటంటే హిందువులు పూజించే ఆవే, హిందూ పార్టీ అయిన బీజేపీని ఓడించి మహాకూటమిని గెలిపించింది!