కాంగ్రెస్ పార్టీ, వైకాపాల నుంచి వచ్చే వలసలకు స్వాగతం పలుకుతున్నారట భారతీయ జనతా పార్టీ నేతలు. త్వరలోనే అమిత్ షా పర్యటన ఉండబోతోందని.. అప్పుడు ఆయన ఆధ్వర్యంలో చేరే వాళ్ల గురించి చర్చిస్తామని బీజేపీ నేతలు అంటున్నారు. ఇందుకోసం విశాఖలో ప్రత్యేక సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారట. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం గురించి, వివిధ పార్టీల నుంచి వచ్చి చేరే నేతల గురించి, అమిత్ షా పర్యటన ఏర్పాట్ల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారట.
మరి పార్టీని బలోపేతం చేసుకోవాలని బీజేపీ భావించడం సబబే కానీ.. ఇతర పార్టీ నేతలకు ఆహ్వానం పలుకుతున్నామని ప్రకటనలు చేయడం మాత్రం ఒక విధంగా ఆశ్చర్యకరం.బీజేపీకి అత్యంత సానుకూల ఫలితాలు వచ్చిన ఎన్నికలు పూర్తై రెండు సంవత్సరాలు పూర్తి అయినా.. ఏపీలో ఆ పార్టీ ఇప్పటి వరకూ బలోపేతం అయిన దాఖలాలు లేవు. బలోపేతం చేస్తాం.. చేస్తాం.. అనేదాంట్లోనే పుణ్యకాలం కాస్తా పూర్తి అయ్యేలా ఉంది. ఆఖరికి ఏపీ విభాగానికి అధ్యక్షుడిని నియమించుకోవడంలో కూడా జాతీయ నాయకత్వం సఫలం అయిన దాఖలాలు లేవు! ఇప్పటి వరకూ ఈ నియామకం రెండు సార్లు క్లైమాక్స్ వరకూ వచ్చి ఆగిపోయింది. ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తామని ఒకసారి, ప్రధానమంత్రి విదేశాల నుంచి రాగానే ప్రకటిస్తామని మరోసారి.. అధ్యక్ష నియామక ప్రకటనను వాయిదా వేశారు కమలనాథులు. మరి ఈ అంశంపై నిర్ణయం తీసుకోలేకపోవడం బీజేపీ బలహీనతే అవుతుంది. ముందుగా ఆ అంశంపై దృష్టి సారించి.. కమలనాథులు ఒక నాయకుడిని నియమించుకోగలిగితే.. ఆ తర్వాత మిగతా పార్టీల నుంచి వచ్చే వలసలపై దృష్టి సారంచవచ్చునేమో!