మంత్రి పదవులు, వందల కోట్లయినా ఇచ్చి… ప్రభుత్వాన్ని కాపాడుకుందామనుకున్న బీజేపీ చివరి క్షణంలో వెనక్కి తగ్గింది. తమ ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో పాటు… బీజేపీ పరువు పోయేలా బేరసారాల ఆడియోలు బయటకు రావడంతో.. గెలిచినా… ఆ చెడ్డ పేరు పార్టీని దేశమొత్తం వెంటాడుతుందని.. తేలిపోియంది. దాంతో ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణాదిన కర్ణాటకలో అడుగుపెట్టాలనుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చివరి క్షణంలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఉదయం అసెంబ్లీలో పరిణామాలు కూడా.. బీజేపీకి మెజార్టీ వచ్చేలా కనిపించలేదు. బలపరీక్ష జరిగినా పరువు పోయే పరిస్థితి ఉండటంతో.. వాజ్ పేయి ఫార్ములాను ఫాలో అయి… ఎంతో కొంత పరువు నిలబెట్టుకోవాలనుకుంది. దాని ప్రకారం వెంటనే కేంద్రమంత్రి అనంతకుమార్.. అసెంబ్లీకి వచ్చి ప్రధాని సందేశాన్ని యడ్యూరప్పకు చేరవేశారు. ఆ తర్వాత యడ్యూరప్ప కూడా అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. రాజీనామా చేయమని అమిత్ షా కూడా సూచించడంతో యడ్యూరప్ప లేఖ రెడీ చేసుకున్నారు.
గతంలో వాజ్ పేయి కూడా బలం లేకపోయనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. విశ్వాస పరీక్ష సమయంలో భావోద్వేగంతో ప్రసంగించి.. ఆ తర్వాత నేరుగా రాజ్‌భవన్ కు వెళ్లి రాజీనామా చేశారు. అధికారం చేతుల్లో ఉన్నా.. ఎంపీలను కొనుగోలు చేసేందుకు వాజ్ పేయి ప్రయత్నించకపోవడంతో ఆయనకు స్టేట్స్ మెన్ గా మంచి పేరు వచ్చింది. కానీ ఇక్కడ మాత్రం.. బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. చివరికి ఆడియో టేపుల్లోనూ దొరికిపోయింది. దాంతో అతిగా ఆశపడినందుకు పరువు పోవడం పక్కా అని తేలిపోవడంతో చివరికి రాజీనామాకు వెనక్కి తగ్గింది. అరవై ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని తప్పిదాలు చేసిందో.. ఈ నాలుగేళ్ల కాలంలో బీజేపీ అన్ని తప్పిందాలు చేసింది. కాంగ్రెస్ చేయలేదా అని ప్రతీ ఘటనలోనూ తనను తాను సమర్థించుకుంటూ వచ్చింది. అలా అయితే కాంగ్రెస్ కు, బీజేపీకి తేడా ఏమిటన్న చర్చ ప్రజల్లో జోరుగా సాగింది. చివరికి కాంగ్రెస్సె బెటరన్న విధంగా బీజేపీ రాజకీయాలు నడిచాయి.
భారతీయ జనతాపార్టీపై ఇప్పటి వరకు కొంత మంది సాఫ్ట్ కార్నర్ ఉండేది. కాంగ్రెస్ అంత దుర్మార్గం కాదన్న భావన ఉండేది. కానీ ఇప్పుడున్న బీజేపీ వాజ్ పేయి, అద్వానీల నాటిది కాదని… సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతుంది. మోదీ బీజేపీకి నైతికత, ప్రజాస్వామ్య విలువలేమీ లేవని ప్రజలు నమ్మడం ప్రారంభించారు. మూడు చిన్న రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ప్రజల్లో ఇంత వ్యతిరేక రాలేదు. కానీ ఇక్కడ గవర్నర్ సాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసి… అలా వచ్చిన అధికారంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేయడంతో… ఉన్న ఇమేజ్ మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు దేశంలో కాంగ్రెస్, కాంగ్రెస్ బీ టీం మాత్రమే ఉన్నాయి. అతిగా ఆశపడిన బీజేపీ.. మొత్తానికే నష్టపోయింది. ఈ ప్రభావం వచ్చే సార్వత్రిక ఎన్నికలపై కూడా ఉంటుంది.