రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం ఏర్పడుతుంది. మరి ఆ రాజ్యాంగాన్ని అమలు చేయకపోతే ఆ ప్రభుత్వం ఎందుకు ?. గతంలో ఒక్క కేసులో కోర్టు ఏదైనా వ్యాఖ్యలు చేస్తే ప్రభుత్వం రాజీనామా చేసేది. కానీ ఇప్పుడు కోర్టులు ఎన్ని దెబ్బలు వేసినా తుడుచుకుని పోతున్నారు. కానీ ఆ ఆదేశాలను మాత్రం పట్టించుకునేందుకు సిద్ధంగా లేరు.
ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం ఎంత దారుణంగా పడిపోయిందో చెప్పడానికి కోర్టుల్లో దాఖలవుతున్న కోర్టు ధిక్కరణ పిటిషన్లే సాక్ష్యం. కొన్ని లక్షల కోర్టు ధిక్కరణ పిటిషన్లు హైకోర్టులో ఉన్నాయి. ఇవన్నీ న్యాయంకోసం వచ్చినవి కావు. న్యాయం చేయమని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిస్తే.. ఆ న్యాయం చేయకపోతే.. పట్టించుకోలేదని కోర్టుకు వచ్చిన పిటిషన్లు. మరి న్యాయంచేయమని వచ్చిన పిటిషన్లు ఇంకెన్ని ఉంటాయి ?, కోర్టుకెళ్తే… ఎంత కాలం పడుతుందో తెలియని పరిస్థితి ఉన్న దేశంలో అంతిమ ఆప్షన్‌గానే ప్రజలు కోర్టును ఎంచుకుంటారు . అదీ ప్రభుత్వంపై పోరాటం అంటే.. అసలు సిద్ధపడరు. కానీ ఈ ప్రభుత్వంతో ఇక ఏమీ కాదని.. తమకు న్యాయపోరాటమే దిక్కని వేలు.. లక్షల మంది న్యాయపోరాటం చేస్తున్నారు.
ఓ ప్రభుత్వంపై ప్రజలు ఈ స్థాయిలో న్యాయపోరాటం చేస్తున్న వైనం చరిత్రలో ఎక్కడా లేదు. ఇక ముందు ఉండదు కూడా. ఎందుకంటే వచ్చే ఏ ప్రజాపాలకుడైనా.. ప్రజల్ని ఇంత దారుణంగా మోసం చేస్తాడని ఎవరూ అనుకోలేరు. కోర్టులతోనూ ప్రభుత్వం ఆడుతున్న ఆటలు చూస్తే ఎవరికైనా ఇంత తప్పుడు పాలన చేస్తూ పదవిలో ఉండటం అవసరమా అని అనుకోవడం కద్దు. ప్రభుత్వాన్ని నమ్మిన వారిని కూడా నట్టేటముంచారు. సర్పంచ్ల నిధుల కోసం రోడ్డెక్కుతారు. స్థానిక సంస్థల ప్రతినిధులు.. ఇదేం రాజకీయం అని ఈసడించుకుంటారు. మళ్లీ వీళ్లంతా ఎవరో పరాయి పార్టీలకు చెందిన వారు కాదు. సొంత పార్టీ వారు కూడా ఖాండ్రిస్తున్నారు. ఎన్నికల్లో సత్తా చూపిస్తామంటున్నారు.
ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నామని.. అటు కుప్పుం నుంచి ఇటు సిక్కోలు వరకూ అందరూ… ప్రభుత్వంపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసేవారే. వారి బాధ వారిది. ఇక ప్రభుత్వం కోసం పనులు చేసిన వైసీపీ నేతల బాధ మరొకటి. బిల్లులు రాక.. కొద్ది మంది ఆత్మహత్యలు చేసుకున్న వార్తలు కూడా వచ్చాయి. అంటే.. సొంతం పార్టీల నేతలకూ నమ్మకం కలిగించలేని పాలన.. విశ్వసనీయత లేని పాలన ప్రస్తుత ప్రభుత్వం చేసింది. ఇంకా ఏమైనా అంటే సొంత పార్టీ నేతల్నీ బెదిరించడం కూడా ఈ పాలనలో విచిత్రం. ఓటేసే ముందు ఇవన్నీ ఆలోచించండి.