ఎస్సీ వర్గీకరణ కోసం తెరాస కట్టుబడి ఉన్న సంగతి తెలిసిందే. ఇదే విషయమై ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసేందుకు, అఖిల పక్ష భేటీ అయ్యేందుకు కేసీఆర్ ప్రయత్నించారు. ప్రధాని అపాయింట్మెంట్ కోరారు. ఇచ్చినట్టే ఇచ్చి… చివరి నిమిషంలో రద్దు చేశారు. దీంతో తెరాస నాయకులు తీవ్ర అసంతృప్తికి గురౌతున్నారు. ఎవరెవరికో ప్రధాని సమయం ఇస్తారుగానీ, కేసీఆర్తో భేటీ అయ్యేందుకు ఎందుకు టైం ఇవ్వడం లేదంటూ తెరాస ఎంపీలు కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. అయితే, భాజపా వాదన మరోలా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి.. ఇలాంటి సున్నితాంశంపై ప్రధాని ఏ ప్రకటన చేసినా.. అది ఎన్నికల్లో ఇంకోరకంగా మేలు చేకూర్చే విధంగా మారుతుందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు.
స్థూలంగా చూస్తే… కేసీఆర్కు ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వెనక కనిపిస్తున్న కారణం ఇది! కానీ, సునిశితంగా పరిశీలిస్తే.. ఇదో క్రెడిట్ గేమ్ అని అర్థమౌతుంది. తెలుగు రాష్ట్రాల్లో భాజపా సొంతంగా ఎదగాలన్నది వారి లక్ష్యం. ముఖ్యంగా తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి ప్రధాన పార్టీగా అవతరించే అవకాశాలున్నాయి. అయితే, ఈ క్రమంలో కేంద్ర కేటాయింపులపై స్థానిక భాజపా క్రెడిట్ దక్కించుకోలేకపోతోంది! కేంద్రం ఏమిచ్చినా, అది కేసీఆర్ సాధించిన ఘనతగా తెరాస ప్రచారం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయంగా భాజపాకు మైలేజ్ ఇవ్వడం లేదనే చెప్పాలి.
ఇక, తాజా విషయానికొస్తే… మాదిగ రిజర్వేషన్ల విషయంలో కేంద్రం కూడా సానుకూలంగానే ఉంది. అయితే, ఏకాభిప్రాయ సాధన అవసరమని కేంద్రమంత్రి వెంకయ్య అంటున్నారు. ఎన్నికలైన తరువాత, తగిన సమయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటామనీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడైనా ప్రధానిని కలుసుకునే వీలుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే చాలా విషయాల్లో భాజపాకి క్రెడిట్ దక్కలేదు. ఈ విషయంలో కూడా కేసీఆర్కు క్రెడిట్ ఇవ్వకూడదనేది భాజపా వ్యూహంగా ఉందని విశ్లేషకుల అంశం. కేసీఆర్ అడిగిన వెంటనే రిజర్వేషన్ల విషయంలో నిర్ణయం తీసుకుంటే.. తెలంగాణలో అది కేసీఆర్ సాధించిన మరో విజయంగా చెప్పుకునే అవకాశం ఎటూ ఉంటుంది. సో… అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా కేంద్రం వ్యూహాత్మంగా ఉందని చెప్పాలి. లక్కీగా యూపీ ఎన్నికల నియమావళి కేంద్రానికి కలిసొచ్చిన పాయింట్. ఈ మధ్య కాలంలో భాజపా-తెరాసల మధ్య దోస్తీ బాగానే కుదిరిందని అనుకున్నా… ఈ విషయంలో మరోసారి రెండు పార్టీల మధ్య వాతావరణం వేడెక్కుతోంది.