తమ్ముడు భరత్ అంత్యక్రియలకు రవితేజ హాజరు కాని నేపథ్యంలో ఒక పోలీసు కమిషనర్ అంతకు ముందు నాతో చెప్పిన వివరాలు తెలుగు360 మిత్రులతో పంచుకున్నాను. ఇప్పుడు పదిమందికి పైగా టాలివుడ్ ప్రముఖులకు నోటీసులు అందిన ఉదంతం దాన్ని ధృవపరుస్తున్నది. ఈ జాబితాలో వున్న వారిలో రవితేజ అందరికన్నా ప్రముఖుడు. తర్వాత చార్మి, పూరీ జగన్నాథ్. సుబ్బరాజు. నవదీప్, తరుణ్, ముమైత్ ఖాన్, వంటి వారు కూడా తక్కువ వారేమీ కాదు. ఇంతకూ ఈ నోటీసులు అందుకున్న వారి పేర్లు నమస్తే తెలంగాణలోనే నేను చూశాను. ఇతరులు చాలామంది ఇచ్చినట్టు లేదు. అయితే ఉదయాన్నే ఆ పత్రికలో వచ్చాయి గనక తర్వాత అన్ని ఛానళ్లు కథనాలు మొదలు పెట్టాయి. నోటీసులు అందిన వారూ అందలేదంటున్న వారు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. వీరిలో చాలామంది గతంలోనూ వివాదాలలో పేరు వినిపించిన వారే గాక పోలీసు కేసులనూ ఎదుర్కొన్న నేపథ్యం వుంది. అయితే పేర్లు రాగానే వారికి సినిమాల్లో అవకాశాలు లేక మత్తుపదార్థాలకు లోబడిపోయారని టీవీ ఛానళ్లు కథనాలు వేయడం విచిత్రమే. ఎందుకంటే అలాటివారంతా వ్యసనాల పాలు కారు, ఇప్పుడు పేర్లు వచ్చిన వారంతా విఫలమైన తారలూ కాదు. ఇంతకన్నా ప్రముఖులు కొందరు తప్పించుకోవడం లేదనీ కాదు.
అయితే ఎక్సయిజ్ ఎన్‌ఫోర్స్‌మెండ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ వీరికి నోటీసు వచ్చింది లేనిది చెప్పకుండా తాము అధికారికంగా ఎవరి పేర్లు బయిటపెట్టలేదంటున్నారు. బహుశా పేర్లు విడుదలయ్యాక ఆయనపై విమర్శలు వచ్చి వుండొచ్చు. మంత్రి కెటిఆర్ ఆయనను పిలిపించి మందలించారని ఒక కథనం చలామణిలో వుంది. రేవంత్ రెడ్డి కొన్ని ఆరోపణలు చేశారు కూడా. సినిమా వారితో మంచిగా వుండాలన్న విధానాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం గట్టిగా పాటిస్తున్నది. శాఖా పరంగా వ్యక్తిగతంగా గాక ప్రచారంలో పెట్టడం మంచిది కాదని ప్రభుత్వం భావించి వుండొచ్చు. ఏమైనా ఇంతలోనే అకున్ సబర్వాల్ తాను పదిరోజులు సెలవుపై వెళుతున్నట్టు చెప్పడం చూస్తుంటే కొంత మధనం నడిచిందనుకోవాలి. విజయవాడలో కాల్‌మనీ కుంబకోణ: సమయంలో గౌతం సవాంగ్‌తో సహా చాలామంది పోలీసు అధికారులు ఐఎఎస్‌లు కూడా ఇలాటి స్తితిని ఎదుర్కొన్నారు. కాస్త అత్యుత్సాహం సంగతి ఎలా వున్నా పెద్ద బెడదగా మారిన మత్తు పదార్థాఆలపై పోరాటం మాత్రం మంచిదే.