లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ ఒకరి తర్వాత ఒకరు కోరస్ పాడుతున్న టీడీపీ నేతల కు చంద్రబాబు చెక్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ అంశం పై ఎవరూ బహిరంగంగా మాట్లాడకూడదని టిడిపి అధినాయకత్వం నుండి వచ్చిన ఆదేశాల మేరకు బహిరంగ వ్యాఖలు ప్రస్తుతానికి ఆగిపోయినా అసలు ఈ చర్చ, రచ్చ ఎక్కడ మొదలై, ఇంతదాకా ఎలా వచ్చిందన్న విశ్లేషణలు మాత్రం ఆగడం లేదు. వివరాల్లోకి వెళ్తే..
లోకేష్ భవిష్యత్తు తోనే టిడిపి భవిష్యత్తు అని నమ్ముతున్న ఒక వర్గం టిడిపి నాయకులు
గత కొన్నిరోజులు గా టిడిపి లో నెలకొన్న రాజకీయ పరిణామాల ని ,లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని ఆ పార్టీ కి చెందిన నాయకులు కొందరు ప్రకటనలు చేయడం గమనించాక , దీని వెనుక టిడిపి లోని ఒక వర్గానికి చెందిన వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్య మంత్రి చంద్ర బాబు పదే పదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు ఉఛ్చరించడం, ఆయన కి అన్ని విషయాల్లోనూ సమ ప్రాధాన్యత ఇవ్వడం, కూటమి లోని ఇతర పక్షాలైన బిజెపి జన సేన లకి సంతృప్తినిస్తున్నప్పటికీ దీని కారణంగా టిడిపి క్యాడర్ కి చెందిన హార్డ్ కోర్ అభిమానుల్లో కొంత మంది కి ఒక రకమైన అభద్రతా భావం నెలకొందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. పరిస్థితులు ఇలానే కొనసాగితే లోకేష్ కి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందనే భయాందోళన టిడిపి ని అమితంగా అభిమానించే కొందరు అభిమానుల తో పాటు, పార్టీ లోని కొన్ని వర్గాల్లో కూడా ఉందని అంటున్నారు. అందుకే పార్టీ కార్యకర్తలను సంతృప్తి పరచడానికి, టిడిపి దీర్ఘకాలిక భవిష్యత్తు ని దృష్టి లో ఉంచుకుని లోకేష్ కి కూడా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కొంత మంది పార్టీ నాయకుల తోనూ, కొన్ని మీడియా ఛానెళ్ల ద్వారా నూ టిడిపి లోని ఆ వర్గాలు ఇలా డిమాండ్ చేయిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
కూటమి ఐక్యత తోనే టిడిపి భవిష్యత్తు అని నమ్ముతున్న మరో వర్గం టిడిపి నాయకులు
దీనికి ప్రతిస్పందన గా ఇటు జన సేన లో కూడా లోకేష్ కి డిప్యూటీ సీఎం అనే వాదన పై సోషల్ మీడియా వేదిక గా తీవ్ర చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ని సీఎం చేస్తే, లోకేష్ ని డిప్యూటీ సీఎం చేసినా మాకు అభ్యంతరం లేదని జనసేన కి చెందిన కొందరు సోషల్ మీడియా వేదిక గా తమ అభిప్రాయాన్ని బలంగా వెలిబుచ్చుతున్నారు. ఈ మొత్తం చర్చ రచ్చ గా మారి, కూటమి లోని టిడిపి, జనసేన పార్టీ ల మధ్య కాస్త ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించింది. దీంతో, కూటమి ఐక్యత లోనే టిడిపి భవిష్యత్తు ఉందని నమ్ముతున్న టిడిపి లోని కొందరు సీనియర్ నాయకులు పరిస్థితులు చేజారక ముందే రంగం లోకి దిగడం, లోకేష్ కి ఇప్పటికిప్పుడు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే కూటమి మధ్య సఖ్యత దెబ్బ తింటుందని, దాని వలన పార్టీ కి నష్టం జరగడమే కాదు, వైకాపా వారికి మరో సారి అవకాశం ఇచ్చినట్టే అని, అలా జరగడం రాష్ట్ర భవిష్యత్తు కి మంచిది కాదని చంద్రబాబు దృష్టి కి తీసుకెళ్ళడం జరిగిందని తెలుస్తోంది. దాని ఫలితమే టిడిపి నుంచి వచ్చిన తాజా ప్రకటన అని సమాచారం.
మొత్తాని కి టిడిపి అధినాయకత్వం చేసిన ప్రకటన ప్రస్తుతాని కి ఈ అంశాం మీద ఇతరత్రా వ్యాఖ్యలు రాకుండా నిలవరించినా, ఎన్నికల కి ఒకటి రెండు సంవత్సరాల ముందు మళ్ళీ తెర మీద కి ఈ అంశం వచ్చే అవకాశం కనిపిస్తోంది.