నాగచైతన్య ‘తండేల్’ సినిమాపై చాలా నమ్మకాలు పెట్టున్నాడు. ఇది ఆయన కెరీర్ లో బిగ్ బడ్జెట్ సినిమా.100 పెర్సెంట్ లవ్ తర్వాత గీత ఆర్ట్స్ లో చేస్తున్న సినిమా. అటు అరవింద్ కూడా ఈ కథపై నమ్మకంతో పెద్ద బడ్జెట్ నే పెట్టారు. అయితే ఈ సినిమా కథ తయారైన విధానం ఆసక్తికరంగా వుంది. శ్రీకాకుళం మత్య్సకారులు పాక్ బోర్డర్ లో చిక్కుకోవడం, రెండు దేశాల దౌత్యం తర్వాత రిలీజ్ కావడం.. అప్పట్లో హెడ్ లైన్స్ లో నిలిచింది.
కార్తిక్ అనే రచయిత ఆ సంఘటన ఆధారంగా కథ రాసుకున్నాడు. ఈ కథ చైతు కంటే ముందు కొందరి దగ్గరికి వెళ్ళింది. చైతు కథ విన్నప్పుడు పాయింట్ బావుంది కానీ స్క్రీన్ ప్లే అంతా ఓ డాక్యుమెంటరీలా అనిపించిందట. ఈ విషయాన్ని స్వయంగా చైతునే చెప్పారు. ”ఈ కథ విన్నప్పుడు సమాచారం అంతా గుదిగుచ్చినట్లుగా అనిపించింది. ఆ కథలో సినిమాటిక్ గ్రామర్ కనిపించలేదు. వాసు దగ్గర ఈ కథ హోల్డ్ అయ్యింది. ఆ పాయింట్ ని కమర్షియల్ గా మార్చి సినిమాకి తగ్గట్టుగా చేయగలిగితే తాను చేస్తా’నని చెప్పాడట చైతు.
ఇదే సమయంలో దర్శకుడు చందూ రంగం ప్రవేశం చేసి ఈ కథని పూర్తిగా లవ్ స్టొరీ మార్చి జరిగిన కథకు యాభై శాతం ఫిక్షన్ జోడించి సినిమాటిక్ గా మార్చడం చైతుకి నచ్చింది. అలా ఈ కథ సెట్స్ పైకి వెళ్ళింది. కొన్ని యాధార్ధ సంఘటనలు ఆధారంగా సినిమా తీసినప్పుడు కమర్షియల్ గా వర్క్ అవుట్ కావాలంటే ఎంతకొంత ఫిక్షన్ యాడ్ కావాల్సిందే. మరి డైరెక్టర్ చందూ యాడింగ్ వాస్తవ కథకు ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.