వాస్తవంగా అమరావతి నగరానికి శంకుస్థాపన జరిగి ఇప్పటికి ఆరునెలలు పైగానే గడచిపోయింది. అయితే ఏదో ఆర్భాటంటా కేంద్ర సాయాన్ని అభ్యర్థించడానికి లేదా, ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి అట్టహాసమైన ‘మళ్లీ శంకుస్థాపన’ కార్యక్రమాన్ని నిర్వహించి కూడా దాదాపు మూడున్నర నెలలు గడచిపోయాయి. ఇప్పటిదాకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లున్నది తప్ప మరొకటి కాదు. సింగిపూర్ మాస్టర్ ప్లాన్ లు పూర్తయ్యాయి అన్నారు.. సింగపూర్ కంపెనీలు గొంతెమ్మ కోరికలు కోరుతున్నాయని అన్నారు.. అంతా సస్పెన్స్‌లో పడ్డట్లుగా కనిపించింది.. పనులు జరుగుతాయో లేదో అని భయం కలిగింది.. ఇన్ని సందేహాల నడుమ ఇప్పుడు అమరావతి పనుల మీద ఒక కొత్త నమ్మకం, హోప్ కలుగుతోంది.
అమరావతి నగరంలో రోడ్లు నిర్మించడానికి సంబంధించి గ్రామస్తుల నుంచి ఉన్న అభ్యంతరాల ఆటంకాలు తొలగినట్లుగా కనిపిస్తున్నది. సహజంగానే కొత్త నగరం నిర్మిస్తూ రోడ్లు వేసేప్పుడు అంతా చక్కగా, ప్రణాళికాబద్ధంగా ఉండేలాగానే రోడ్లు వేస్తారు తప్ప.. వంకరటింకరలుగా ఇళ్ల మధ్యలోంచి మలుపులు తిప్పుతూ వేయరు. అయితే ఇప్పుడు అమరావతి పల్లెలు ఉన్న చోట నిర్మాణం అవుతున్నందువల్ల.. ఇలాంటి రోడ్లు వేయడానికి అనివార్యం కొన్ని ఇళ్లను కూల్చివేయాల్సి న పరిస్థితి. అలాంటి వారంతా కూడా.. తమ ఇళ్లను కూల్చేయడానికి తాజాగా అంగీకరించినట్లుగా మంత్రి నారాయణ వెల్లడిస్తున్నారు.
నిజానికి ‘రహదారులు ప్రగతికి మార్గాలు’ అనేది పురాతన కాలంనుంచి ఉన్న నానుడి. మంచి రోడ్డు సదుపాయాలు ఉండడం అనేది అనేక రకాలుగా అభివృద్ధికి కారణం అవుతుంది. అదే విధంగా… అమరావతి విషయంలో కూడా ముందు రోడ్ల నిర్మాణానికి అన్ని అభ్యంతరాలు తొలగిపోవడం అనేది శుభపరిణామంగా చెప్పుకోవాలి. నారాయణ చెబుతున్న సంగతి వాస్తవమే అయి రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు మొదలై, కార్యరూపంలో ఒక దశకు చేరుకుంటే గనుక.. నగర నిర్మాణానికి సంబంధించి.. మిగిలిన రాష్ట్ర ప్రజల్లో కూడా ఒక హోప్, నమ్మకం కలుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఒకవైపు నిర్దిష్టంగా ప్లాన్చేసిన రోడ్ల పని ప్రారంభించేస్తే.. వాటితో పాటుగా.. కేంద్రప్రభుత్వ నిధులతో నిర్మించే ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన కోర్ రాజధాని భవనాల నిర్మాణం వంటివి అన్నీ మొదలు పెట్టేయవచ్చు. అలా జరిగితే చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్నట్లుగా 2018 సంవత్సరాంతం నాటికి ఒక మోస్తరు రూపం వచ్చిన రాజధానిని ప్రజలకు చూపించడం సాధ్యం అవుతుందని పలువురు భావిస్తున్నారు.
అయితే.. ఈ నమ్మకం అంతా కూడా ప్రజల అభ్యంతరాల తొలగిపోయాయని మంత్రి నారాయణ చెబుతున్న మాటలు వాస్తవం అయితే మాత్రమే. గతంలో చాలా సార్లు ఆయన ఇలాంటి విషయాల్లో అర్థసత్యాలతో జనాన్ని మభ్యపుచ్చే ప్రయత్నం చేశారు. ఈసారి అలాకాకపోతే బాగుటుందని జనం అనుకుంటున్నారు.