డెబ్యూ హీరో సినిమా అంటే కొన్ని లెక్కలుంటాయి. హీరో స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంది? నటన ఎలా ఉంది? కమర్షియల్ యాంగిల్ ఏమిటి? అనేది ఆ సినిమా బయటకు వచ్చాక గానీ తెలీదు. ఒక్క సినిమా కూడా విడుదల కాకుండా – నాలుగైదు ప్రాజెక్టుల్ని చేతిలో ఉంచుకోవడం మామూలు విషయం కాదు. బెల్లంకొండ గణేష్ విషయంలో ఇదే జరుగుతోంది. బెల్లంకొండ సురేష్ ఇంటి నుంచి సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చాడు. కమర్షియల్ హీరోగా నిలదొక్కుకునేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు తమ్ముడు గణేష్ కూడా హీరో అయిపోయాడు. తాను హీరోగా నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా మొదలెట్టేశాడు. తేజ దగ్గర శిష్యరికం చేసిన రాకేష్ ఉప్పల పాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇదో న్యూ ఏజ్ థ్రిల్లర్. ఈ రోజే ప్రారంభమైంది. కథలు, ప్రాజెక్టుల విషయంలో.. బెల్లంకొండ సురేష్ హ్యాండ్ ఎంత ఉన్నా – ఒక్క సినిమా కూడా రెడీ కాకుండా మరో రెండు సినిమాలు మొదలెట్టేయడం మామూలు విషయం కాదు. ఈ విషయంలో శ్రీనివాస్ కంటే.. గణేషే స్పీడుమీదున్నట్టు లెక్క. గణేష్ కోసం మరో రెండు కథలు సిద్ధంగా ఉన్నాయని, తొలి సినిమా విడుదలైన తరవాత.. ఆ రెండూ మొదలవుతాయని తెలుస్తోంది. మొత్తానికి హిట్టొచ్చి,నా, రాకున్నా – నాలుగైదేళ్లు ఇండ్రస్ట్రీలో ఉండేలా తన కెరీర్ ప్లాన్ చేసుకున్నాడన్నమాట.