తనయుడ్ని ప్రమోట్ చేసుకునే విషయంలో రాబోయే నిర్మాతలకు ఓ బెంచ్ మార్క్ సెట్ చేసి పెట్టాడు బెల్లంకొండ సురేష్. సాయి శ్రీనివాస్ మార్కెట్ కి మించి ఖర్చు పెట్టి, భారీ స్థాయిలో ప్రమోషన్లు చేసి – ఓ మాస్ హీరోగా నిలబెట్టే విషయంలో తన వంతు కృషి చేశాడు. `రాక్షసుడు`తో శ్రీనివాస్ కూడా ఓ హిట్టు కొట్టి చూపించాడు. ఇప్పుడు బెల్లంకొండ దృష్టి తన మరోవారసుడిపై పడింది. బెల్లంకొండ చిన్న కుమారుడు గణేష్ కూడా త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే కథ సిద్ధమైపోయింది. `ప్రేమ ఇష్క్ కాదల్`, `సావిత్రి` చిత్రాల దర్శకుడు పవన్ సాధినేని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. నభా నటేషాని కథానాయికగా ఎంచుకున్నారని తెలుస్తోంది. దసరాకి ఈ సినిమా కొబ్బరికాయ కొట్టుకోబోతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ తొలి సినిమా `అల్లుడు శ్రీను`ని భారీ స్థాయిలో తీసి, ప్రమోట్ చేశాడు సురేష్. రెండో కుమారుడి సినిమా కోసం కూడా అంతే కేర్ తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం పేరున్న నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని ఎంచుకోబోతున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి.