వారసులకున్న అడ్వాంటేజ్ వేరు. వెనుక ఉండి నడిపించేవాళ్లకు లోటు ఉండదు. ఒకట్రెండు ఫ్లాపులు పడినా… కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ అండా దండా.. బెల్లం కొండ శ్రీనివాస్కీ ఉన్నాయి. బెల్లంకొండ సురేష్తనయుడుగా తెలుగు తెరపై అరంగేట్రం చేశాడు శ్రీనివాస్. అల్లుడు శ్రీను ఎంట్రీ కోసం బాగా ఖర్చు పెట్టారు. దాదాపుగా ఓ స్టార్ హీరోకి ఎంత బడ్జెట్ అవుతుందో.. అంతా కేటాయించారు. ‘వినాయక్ బొమ్మ’ అనే పేరు మీదే.. అల్లుడు శ్రీను నడిచిందన్నది వాస్తవం. అయితే బెల్లం కొండ కూడా బాగానే చేశాడు. మరీ ముఖ్యంగా స్పీడ్ డాన్సర్ గా పేరు తెచ్చుకొన్నాడు. ఆ తరవాత వచ్చిన స్పీడున్నోడు బాగా నిరాశ పరిచింది. మూడో ప్రయత్నంగా ‘జయ జానకి నాయక’ రూపొందుతోంది. ఈ సినిమాకు నిర్మాత ఎవరైనా… తెర వెనుక ఉన్నది బెల్లం కొండ సురేషే. ఆయన ఉన్నారన్న ధైర్యంతో ఖర్చుకి వెనకాడకుండా… జయ జానకీ నాయక చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా బడ్జెట్ ఎప్పుడో రూ.40 కోట్లు దాటేసింది. ఇంకా ఓ పాట మిగిలి వుంది. దానికి మరో రూ.3 కోట్లు పెడుతున్నారు. ఎంత ఖర్చు పెట్టినా.. ఈసినిమా కూడా ‘బోయపాటి బొమ్మ’గానే బయటకు వస్తుంది. ఖర్చుకి వెనకాడకుండా భారీ బడ్జెట్‌తో సినిమాలు తీయడం వరకూ ఓకే. కానీ.. శ్రీనివాస్ తనదైన ముద్ర చూపించుకోవాలిగా. తన బొమ్మ చూసి జనాలు థియేటర్‌కి రావాలిగా. అలా రావాలంటే.. సాయి శ్రీనివాస్ బడ్జెట్‌నో, దర్శకుడినో కాదు.. కథల్ని నమ్ముకోవాలి. నవతరం దర్శకులతో సినిమాలు చేయాలి. అప్పుడు నటుడిగా.. తనకంటూ ఓ గుర్తింపు వస్తుంది. విజయాలు వరిస్తే.. స్టార్ అవుతాడు. అప్పుడు స్టార్ దర్శకులతో సినిమా చేస్తే.. మైలేజీ పెంచుకోవొచ్చు. ఎలాంటి ఇమేజ్ లేకుండా.. స్టార్ దర్శకులతో సినిమాలు చేయడం వల్ల ఓ సమస్య ఉంది. సినిమా హిట్టయితే క్రెడిట్ అంతా… ఆయా దర్శకులకే వెళ్లిపోతుంది.
ఈ విషయంలో సురేష్ బాబు వ్యూహం కరెక్ట్ అనుకోవాలి. రానాని స్టార్ దర్శకుల చేతిలో పెట్టలేదు. తనయుడు హీరోగా ఎదగాలన్న అత్యుత్సాహంతో.. కోట్లు ధారబోసి సినిమాలు తీయలేదు. జస్ట్.. రానాని తనకు నచ్చినట్టు కెరీర్ మలచుకొనే స్వేచ్ఛ ఇచ్చాడు. ఇప్పుడు బెల్లంకొండ కూడా సురేష్‌బాబు దారిలోనడిస్తే బాగుణ్నేమో అనిపిస్తుంది. చిన్న చిన్న దర్శకులు, కొత్త తరహా కథలతో తనని తాను నిరూపించుకోవడంపై దృష్టి పెడితే మంచిదనిపిస్తుంది. అప్పుడు బోయపాటి లాంటి దర్శకులు పనిగట్టుకొని కథలు రాసుకొంటారు. సాయి.. కాస్త ఆలోచించమ్మా.