‘సాక్ష్యం’ ఎఫెక్ట్ బెల్లంకొండపై బాగానే పడినట్టుంది. అందుకే ఇప్పుడు ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు. మరీ ముఖ్యంగా సినిమా బడ్జెట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సాక్ష్యం ముందొచ్చిన ‘జయ జానకీ నాయక’ కూడా హెవీ బడ్జెట్ వల్ల దెబ్బతిన్న సినిమానే. మార్కెట్‌కి మించి ఖర్చు పెడితే నష్టాలు తప్పవని ఈ రెండు చిత్రాలూ నిరూపించాయి. ఈ దెబ్బతో… బెల్లంకొండకు వాస్తవాలూ తెలిసొచ్చాయి. ఇది వరకు ‘మీ సినిమాలకు మార్కెట్‌కి మించి ఖర్చు పెడతారెందుకు?’ అని అడిగితే… చాలా తేలిగ్గా తీసుకునేవాడు. ”ఈరోజుల్లో మార్కెట్ కి తగినంతే ఖర్చు చేయాలని ఏం లేదు. సినిమా బాగుంటే కచ్చితంగా జనాలు చూస్తారు. దానికి తోడు తెలుగు సినిమా స్టామినా కూడా పెరిగిందoటూ చెప్పేవాడు. ఇప్పుడు మాత్రం వాస్తవాల్లోకి వచ్చాడు.
తన గత చిత్రాలు కాస్ట్ ఫెయిల్యూర్స్ అని ఒప్పుకుంటున్నాడు. ఆ ఫలితాల్ని దృష్టిలో ఉంచుకునే ‘కవచం’ని తన మార్కెట్ పరిధిలోనే చేశామని చెప్పుకొచ్చాడు బెల్లంకొండ. స్టార్ హీరోలు సైతం తమ మార్కెట్లని దృష్టిలో ఉంచుకునే సినిమాలు చేస్తున్నారు. బడ్జెట్ పరిధులు పెరక్కుండా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అలాంటప్పుడు బెల్లంకొండ లాంటి హీరోలు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి..? సినిమా బాగుంటే.. కచ్చితంగా మంచి వసూళ్లు వస్తాయి. కాకపోతే…. అదంతా బోనస్ అనుకోవాలి. నిర్మాత వీలైనంత త్వరగా బయటపడేలా.. తనపై భారం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఈ విషయంలో బెల్లకొండ పాఠాలు నేర్చుకున్నట్టే కనిపిస్తోంది. గత చిత్రాల్లో బెల్లకొండ సురేష్ ఆర్థిక సహకారం బాగా ఉండేది. బెల్లంకొండ సినిమాల్లో స్టార్ హీరోయిన్లు కనిపించడానికి, పాటలు అంత భారీగా ఉండడానికీ పరోక్షంగా బెల్లంకొండ సురేష్ సహకరించేవాడు. ‘కవచం’ సినిమాకి మాత్రం నిర్మాణ విషయంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదని తెలుస్తోంది. బహుశా… తనయుడి ఫ్లాపులు తండ్రికీ పాఠాలు నేర్పాయేమో.