ఈవారం నాలుగైదు సినిమాలు రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి. వాటిలో కాస్తో కూస్తో క్రేజ్ ఉన్న సినిమాలు రెండే రెండు. ఒకటి… ‘అహింస’, రెండోది ‘నేను స్టూడెంట్ సార్’. ఈ రెండు సినిమాల్లోనూ వారసుల హీరోలే నటించారు. స్వాతిముత్యంతో తెరంగేట్రం చేసిన బెల్లంకొండ గణేష్ కి ఇది రెండో సినిమా. తొలి సినిమా యావరేజ్ మార్కులు తెచ్చుకొంది. స్వాతిముత్యం పాత్రకు తగ్గట్టుగానే గణేష్ తెరపై కనిపించాడు. ప్రతీసారీ అదే నటన, అవే ఎక్స్ప్రెషన్స్ చెల్లుబాటు కావు. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవాలి. గణేష్ స్టామినా ఏమిటో ఈ సినిమాతో తేలిపోనుంది. పైగా ఇది స్టూడెంట్ కథ. హీరోలకు స్టూడెంట్ కథలు బాగా కలిసొచ్చాయి. ఇలాంటి కథలతో హిట్లు కొడితే – యూత్ లో క్రేజ్ సంపాదించుకోవచ్చు. గణేష్ తదుపరి ఎలాంటి సినిమాలు చేయాలి? ఎలాంటి కథలు ఎంచుకోవాలి? అనే ప్రశ్నకు ఈ సినిమా ఓ సమాధానం కావొచ్చు.
తేజ దర్శకత్వం వహించిన ‘అహింస’ కూడా టాక్ ఆఫ్ ది టౌనే. ఎందుకంటే ఈ సినిమాలో దగ్గుబాటి అభిరామ్ హీరో. తనకు ఇదే తొలి సినిమా. ఈ సినిమా హిట్టయినా, ఫ్లాప్ అయినా తేజకు వచ్చిన నష్టం ఏమీ ఉండదు. కానీ… దగ్గుబాటి అభిరామ్ కెరీర్ మొత్తం ఈ సినిమాతో ముడి పడి ఉంది. కెమెరా ముందుకు తీసుకురావడానికి ముందు అభిరామ్ చాలా ట్రైనింగ్ తీసుకోవాల్సివచ్చిందట. తన నటనకు సెట్స్ లో కూడా నగిషీలు దిద్దాల్సిన అవసరం ఏర్పడిందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే అభి ఎలా నటిస్తాడు? అనే ఆసక్తి రేగింది. ఈ సినిమా అటూ ఇటూగా ఆడినా, నటుడిగా అభిరామ్ మార్కులు తెచ్చుకొంటే చాలు. చేతిలో ఎలాగూ సురేష్ ప్రొడక్షన్స్ ఉంది కాబట్టి… మరో సినిమా చేసుకోవచ్చు. నెగిటీవ్ రిపోర్ట్ వస్తే మాత్రం అభితో మరో సినిమా చేయకపోవచ్చు. అందుకే ఈ సినిమాతో కనీసం పాస్ మార్కులైనా వస్తాయా? రావా? అనే కోణంలో ఈ సినిమాని చూస్తున్నారంతా.