బెల్లం చుట్టూ చీమలు చేరడం ఎంత సహజమో.. ‘బెల్లం కొండ’ శ్రీనివాస్ చుట్టూ హీరోయిన్లు చేరడం కూడా అంతే సహజంగా మారింది. బెల్లంకొండ శ్రీనివాస్ ఓ కొత్త హీరో! అయినప్పటికీ ఆయ పక్కన స్టార్ హీరోయిన్లు చిందేస్తుంటారు. తొలి సినిమాకే సమంతతో ఆడిపాడాడు శ్రీనివాస్. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ కోసం రకుల్‌ప్రీత్ సింగ్‌ని కథానాయికగా తీసుకొన్నారు. స్టార్ హీరోయిన్ తమన్నాతో రెండు ప్రత్యేక గీతాల్లో నటించాడు బెల్లంకొండ. శ్రీను త్వరలోనే శ్రీవాస్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఆ సినిమా కోసం కూడా స్టార్ హీరోయిన్నే తీసుకోవాలని చిత్రబృందం ఫిక్సయిపోయింది. ఆ ప్లేసు కీర్తి సురేష్‌కి దక్కింది.
బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా అనగానే… హీరోయిన్లు ఎందుకిలా క్యూ కడుతున్నారు?? అని అడిగితే ఒకే ఒక్క సమాధానం కనిపిస్తుంది. బెల్లంకొండ సినిమా అయితే పారితోషికం బాగా ముడుతోందన్న టాక్ వినిపిస్తోంది. అది నిజం కూడా. తొలి సినిమాకి సమంతకు ఏకంగా రూ.2 కోట్లు ఇచ్చారని అప్పట్లో ప్రచారం జరిగింది. తమన్నా అయితే ఒక్కో ప్రత్యేక గీతానికీ రూ.70 లక్షల వరకూ తీసుకొందట. రకుల్ పారితోషికం రూ.80 లక్షలే. కానీ శ్రీను సినిమా అనేసరికి.. కోటీ పాతిక చదివించుకొన్నార్ట. ఇప్పుడు కీర్తి సురేష్ కూడా అంతే. కీర్తి పారితోషికం రూ.60 లక్షల లోపే. అయితే ఈసారి రూ.80 లక్షలు ఆఫర్ చేశార్ట. అందుకే బెల్లంకొండ సినిమా అనగానే – హీరోయిన్లు మరో మాట ఎత్తకుండా సై అంటున్నారు. కాకపోతే.. పారితోషికాలే భారీగా ముట్టజెప్పాల్సివస్తోంది.