కవచం రిలీజ్ డేట్ ప్రకటించేశారు. డిసెంబరు 7న ఈ సినిమా రాబోతోంది. నిజానికి… కవచం ఇంత త్వరగా రెడీ అవుతుందని ఎవ్వరూ అనుకోలేదు. డిసెంబరులో విడుదల చేస్తారన్న హింట్ ఉంది గానీ, అది మరీ మొదటి వారానికి వచ్చేస్తుందని ఊహించలేదు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పబ్లిసిటీ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. తన సినిమా వస్తుందంటే.. నెల రోజుల ముందు నుంచీ ప్రచారం ఊదరగొట్టేస్తాడు. అయితే.. ఈసారి అంత టైమ్ లేదు. మరో పది రోజుల్లో సినిమా. ఇంత వరకూ ట్రైలర్ కూడా రాలేదు. నిజానికి డిసెంబరు ఆఖరి వారంలో కవచం సినిమాని విడుదల చేద్దామనుకున్నారు. కానీ.. డిసెంబరు అంత మంచి సీజన్ కాదు. 21న నాలుగు సినిమాలు వరుస కడుతున్నాయి. అంతరిక్షం, పడి పడి లేచె మనసు, యాత్ర.. ఇలా ప్రతీ సినిమాకీ సెపరేటు మైలేజీ ఉంది. వీటిలో ఏది నిలదొక్కుకున్నా… 28న కవచం విడుదల కాదు. అందుకే…. కవచం టీమ్ కాస్త రిస్క్ చేసి ముందస్తుగా విడుదల గంట మోగించేసింది. డిసెంబరు 7 దాటితే… ఫిబ్రవరి వరకూ మంచి డేట్ దొరకదు. అందుకే… యుద్ధ ప్రాతిపదికన సినిమాని సిద్ధం చేసేస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఓ కొలిక్కి వస్తున్నాయి. రేపటి నుంచి ప్రచారాన్ని మొదలెట్టడానికి సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. మరోవైపు `కవచం` కంటే ముందే సెట్‌పైకి వెళ్లిపోయిన తేజ సినిమా మాత్రం ఇప్పటి వరకూ టైటిల్ కూడా ప్రకటించలేదు. వ్యవహారం చూస్తుంటే… తేజ సినిమా ఫిబ్రవరి, మార్చిలకు వెళ్లిపోయినట్టే కనిపిస్తోంది.