వినాయక్, బోయపాటి శ్రీను, శ్రీవాస్, తేజ… ఇలా కెరీర్ ప్రారంభంలోనే పెద్ద పెద్ద దర్శకులతో పనిచేసే అవకాశం దక్కింది బెల్లంకొండ శ్రీనివాస్‌కి. బడ్జెట్లూ పెంచుకుంటూ పోతూ… మాస్ హీరోగా తన స్థానాన్ని సినిమా సినిమాకీ బలపరుచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. తన సినిమాకి రూ.40 కోట్లు పెట్టే నిర్మాత ఉన్నారంటే… శ్రీనివాస్ కెరీర్ ప్లానింగ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో అర్థమవుతోంది. ఇప్పుడు ‘సాక్ష్యం’తో మరోసారి అలరించడాని సిద్ధమయ్యాడు. ఈనెల 27న ‘సాక్ష్యం’ విడుదల అవుతోంది. ఈ సందర్భంగా బెల్లంకొండ శ్రీనివాస్‌తో చిట్ చాట్
* ఈ సినిమాలో సమ్‌థింగ్ స్పెషల్ అనిపించిన విషయం ఏమిటి?
– కథే స్పెషల్. జయ జానకీ నాయక విడుదల అవ్వక ముందే ఈ కథ చెప్పారు. పంచభూతాలనేవి మనం నిత్యం చూస్తున్నవే. గాలిపీలుస్తాం. నిప్పుతో వండుతాం. నేలపై నడుస్తాం.. అలా పంచభూతాలకీ మన జీవితానికీ లింకు ఉంది. దీన్ని వాడుకుని శ్రీవాస్ భలే కథ చేశారు. స్క్రీన్ ప్లే పరంగా అచ్చంగా తెలుగు సినిమా ఫార్మెట్లో 5 పాటలు.. 5 క్లైమాక్స్‌లాంటి ఫైట్లతో సాగుతుంది. ఆయన కథ చెప్పిన విధానం, కథలోని అంశాలు బాగా ఉత్సాహపరిచాయి. ఈ కథని నిజాయతీగా ప్రేమించా. ‘జయ జానకి నాయక’ టీజర్ కూడా అప్పటికి బయటకు రాలేదు. ఆ సినిమా కంటే ముందే నన్ను నమ్మారు. కాకపోతే ఒక్కటే షరతు విధించారు. ‘ఈ సినిమా అయ్యేంత వరకూ ఏ సినిమాకీ సంతకం పెట్టకండి’ అన్నారు. అందుకే మరో కథ వినలేదు. ఈ సినిమా కోసం 150 రోజులు పనిచేశాం. పోరాట ఘట్టాల కోసం స్పెషల్ ట్రైనింగ్ అవసరం అయ్యింది. మన కెరీర్లో చాలా సినిమాలు రావొచ్చు. కానీ కొన్నింటినే జీవితాంతం గుర్తు పెట్టుకుంటాం. అలాంటి సినిమా ఇది.
* సోషియో ఫాంటసీ సినిమా అనుకోవచ్చా?
– లేదండీ.. ఇది పక్కా కమర్షియల్ సినిమా. రిలయ్గా ఉంటుంది. పంచబూతాల్ని కథలోకి ఎలా తీసుకొచ్చామన్నది ఆసక్తి కలిగిస్తుంది. ఛ.. ఇలా జరుగుతుందా? అన్నట్టు ఉండదు. అరె..వా భలే జరిగిందే అన్నట్టు ఉంటుంది. సాక్ష్యం.. ఓ థియేటరికల్ ఎక్స్ పీరియన్స్ .
* ఈ సినిమా కోసం చాలా సాహసాలు చేశార్ట..?
– అవునండీ చాలా చేశా. కొండల మీద నుంచి దూకించారు. రిస్కీ షాట్లు చేశా. ఇంత కష్టపడినట్టు మాడాడీకి కూడా తెలీదు. అవుట్ పుట్ చూశాక నాన్న కంగారు పడ్డారు. తేజగారి సెట్లో ఉంటే రోజుకి మూడు సార్లు ఫోన్లు చేస్తున్నారు. ` యాక్షన్ సీన్లలో రిస్కులు చేయకు. మనకు అవసరం లేదు` అని చెబుతున్నారు.
* నిజంగానే ఇంత రిస్కు అవసరమా?
– తప్పదండీ. ఎంత కష్టపడినా తెరపై చూసుకున్నప్పుడు ఓ ఫీల్ వస్తుంది. అది చాలు. పీటర్ హెయిన్స్ మాస్టారు కూడా.. ‘ఇన్ని రిస్కులు అవసరం లేదు’ అని చెప్పేవారు. ఆయన మగధీరలో చాలా సాహసాలు చేశారు. దాని ఫలితంగా మూడు నెలలు మంచం మీదే ఉండాల్సివచ్చింది. ఈ విషయం ఆయనే చెప్పారు. ‘సార్ మీరు అంత రిస్కు చేశారు కాబట్టే.. బాహుబలి లాంటి సినిమా వచ్చింది కదా’ అన్నాను. ఆ స్ఫూర్తితోనే ఇన్ని రిస్కులు తీసుకున్నా. నా గత మూడు సినిమాలకూ నేను చాలా కష్టపడ్డాననుకుంటారు. కానీ.. ఈ సినిమాకే ఎక్కువ కష్టపడ్డాను. దానికి తగిన ఫలితం వస్తుందని నమ్ముతున్నా.
* పంచభూతాల కాన్సెప్ట్ పోరాట దృశ్యాల్లోనూ వాడారట..
– అవునండీ గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం.. ఇలా ఒక్కో శక్తిని వాడుకుంటూ ఒక్కో ఫైట్ చేశాం. పీటర్ హెయిన్స్ చాలా బాగా డిజైన్ చేశారు. ఆయనకు ఈ కథ బాగా నచ్చింది. `నేను కనుక దర్శకుడ్ని అయితే ఇలాంటి కథనే ఎంచుకుంటా` అన్నారాయన.
* వీఎఫ్ఎక్స్ సన్నివేశాలూ చాలా ఉన్నాయట. నిజమేనా?
– ఉంటాయండీ. కానీ మొత్తం సీన్‌ని వీఎఫ్ఎక్స్లో తీయలేదు. అలా తీస్తే సహజత్వం దెబ్బతింటుంది. ఓ మనిషి నిజంగా కొడితే ఎలా ఉంటుందో.. అలానే చూపించాం. గాల్లో ఎగిరిపోవడాలేం ఉండవు. ఒక్కో యాక్షన్ సీన్ కోసం 15 నుంచి 20 రోజులు షూట్ చేశాం. దర్శకుడి విజన్ చాలా గొప్పది. ఆయన ఓ మంచి కథ తీసుకొచ్చారు. అదే మాలో ఉత్సాహాన్ని, కసినీ నింపింది. అందరూ `ది బెస్ట్` ఇవ్వాలని చూశారు. శ్రీవాస్ కథ చెప్పినప్పుడే హిట్ సినిమా అని అందరికీ తెలుసు. దాన్ని ఓ బ్లాక్ బ్లస్టర్గా చేయాలన్నది మా అందరి తాపత్రయం
* సినిమా సినిమాకీ స్పాన్ పెరిగిపోతోంది, బడ్జెట్లూ పెంచుకుంటూ పోతున్నారు. రిస్క్ ఎక్కువ అవుతోందేమో?
– బడ్జెట్, స్పాన్ పెరగడం మంచిదే కదండీ. ప్రతీ సినిమాకీ ఒక్కో మెట్టు ఎదగాలని ప్రయత్నిస్తున్నా. అందుకే జాగ్రత్తగా సినిమాలు ప్లాన్ చేస్తున్నా. బోలెడు ఆఫర్లు వస్తున్నాయి. కానీ కంగారు పడడం లేదు. ఫలానా కుర్రాడి దగ్గర నుంచి ఓ సినిమా వస్తోందంటే మినిమం గ్యారెంటీ సినిమా ఇస్తాడని జనం నమ్మాలి. అలాంటి గుడ్ విల్ పోగొట్టుకోకూడదు.
* మీ మార్కెట్ కంటే బడ్జెట్ ఎక్కువ అవుతోందని చెప్పుకుంటున్నారు. ఇది గమనించారా?
– మార్కెట్ ఎంత ఉందో.. బడ్జెట్టూ అంతే పెడతారు. దాన్ని మించి పెట్టరు. శాటిలైట్ కూడా డబ్బులే. శాటిలైట్, థియేటరికల్, డిజిటల్ ఇలా రకరకాల రూపాల్లో డబ్బులొస్తున్నాయి. అవి చూసే నిర్మాతలు సినిమాలు తీస్తారు.
* ఓ నిర్మాత తనయుడిగా బడ్జెట్ గురించి ఆలోచిస్తుంటారా?
– నేనెప్పుడూ నిర్మాతల హీరోనే. ప్రతీ షెడ్యూల్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాం. ఓ సినిమాలో ఇన్ వాల్వ్ అయితే ఓ సహాయ దర్శకుడిగానే పనిచేస్తా. నా సినిమాకి ఇంత డబ్బు పెట్టమని నేనెప్పుడూ ఒత్తిడికి తీసుకురాలేను. నాతో సినిమా చేసిన దర్శకులు, నిర్మాతలూ హ్యాపీగానే ఉన్నారు.
* చాలా అనుభవం ఉన్న నటీనటులతో పనిచేశారు. వాళ్ల ఇన్పుట్స్ ఎంత వరకూ ఉపయోగపడ్డాయి?
– ప్రతీ ఒక్కరూ ఈ సినిమాని ఓన్ చేసుకున్నారు. వాళ్లకు తోచిన చిన్న చిన్న ఇన్పుట్స్ ఇచ్చారు. అవి కూడా తీసుకుని సినిమాలో పెట్టాం. మేం చాలా పెద్ద సినిమా తీశాం. రెండు పార్టులుగా తీస్తే బాగుండేదేమో అని ఇప్పుడు అనిపిస్తోంది. ఎడిటర్ చంటిగారు బాగా కట్ చేశారు.
* సెన్సార్ ఇష్యూలు వచ్చాయి కదా?
– ఈనెల 27న కిందా మీదా పడైనా సరే.. సినిమా విడుదల చేస్తాం. సినిమా కష్టాలు అంటుంటారు కదా? అవి ఇలాంటి మంచి సినిమాలకు తప్పవు.
* తేజ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
– మీరెవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది. పది రోజుల షూటింగ్ అయిపోయింది. తొలి సగం అంతా యాక్షనే ఉంటుంది. తొలిరోజే.. పదిపేజీల డైలాగులున్న సీన్ ఇచ్చారు. మొత్తం చెప్పేశాను ‘కమర్షియల్ సినిమాలు చేసే నీలో ఇంత మంచి ఆర్టిస్టువి అనుకోలేదు’ అని కాంప్లిమెంట్ ఇచ్చారు.