బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రీతిలో పరుగులు పెడుతోంది. ఈరోజు ఒక్క రోజే ఒకేసారి రెండు సినిమాలు పట్టాలెక్కించాడు. ‘చావు కబురు చల్లగా’ దర్శకుడు కౌశిక్ దర్శకత్వంలో ఓ చిత్రం ఈరోజు ఉదయమే లాంఛనంగా ప్రారంభం అయ్యింది. షైన్ స్క్రీన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనుపమ పరమేశ్వరన్ ని కథానాయికా ఎంచుకొన్నారు. ఈ చిత్రానికి ‘కిష్కిందపురి’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. కోతులకూ ఈ కథకూ ఓ లింకు ఉంది. అందుకే ఈ టైటిల్ ఎంచుకొన్నారు.
మరోవైపు లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో నటించడానికి బెల్లంకొండ అంగీకారం తెలిపాడు. దాదాపు రూ.50 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం కూడా ఈరోజే షూటింగ్ మొదలుపెట్టుకోనుంది. ‘ఉద్భవ’, ‘హైందవ’, ‘వామన’ అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఓ దేవాలయం చుట్టూ నడిచే కథ ఇది. ఇందుకోసం హైదరాబాద్ లో ఓ భారీ సెట్ ని తీర్చిదిద్దుతున్నారు. ఉదయం కౌశిక్ సినిమాకు క్లాప్ కొట్టారు. మధ్యాహ్నం లుధీర్ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇలా ఒకేరోజున రెండు సినిమాలు మొదలెట్టాడు బెల్లంకొండ. మరోవైపు తను నటించిన ‘టైసన్ నాయుడు’ తుది మెరుగులు దిద్దుకొనే పనిలో ఉంది. సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తారు.