బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ చాలా ప్లానింగ్‌తో మొదలైంది. కొడితే ఏనుకు కుంభస్థలాన్ని కొట్టాలన్న కసితో… తొలి సినిమాకే వినాయక్ ని తీసుకొచ్చారు. ఆ తరవాత బోయపాటి శ్రీను. అలా తొలి అడుగుల్లోనే స్టార్ దర్శకులతో పనిచేసే వెసులు బాటు వచ్చింది. శ్రీవాస్ కూడా కమర్షియల్ దర్శకుడే. అలా దర్శకుల ఎంపికలో ఎప్పుడూ తప్పు చేయలేదు. మాస్ కథలకు సరిపడా పర్సనాలిటీ ఉంది కాబట్టి… ఆ తరహా కథలనే ఎంచుకున్నాడు. అలా కథల విషయంలోనూ తప్పటడుగులు వేయలేదు. కాకపోతే… బడ్జెట్ విషయంలోనే కాస్త ఆలోచించాలి. జయజానకి నాయకకు మంచి వసూళ్లే వచ్చాయి. ఓ విధంగా చెప్పాలంటే బెల్లంకొండ రేంజ్‌కి ఆ వసూళ్లు చాలా ఎక్కువ. సాక్ష్యంకీ ఓపెనింగ్స్ బాగున్నాయి. కాకపోతే.. బడ్జెట్లతో పోలిస్తే మాత్రం అవి చాలా తక్కువ. శ్రీనివాస్‌ని ఓ రేంజ్లో చూడాలన్నది బెల్లంకొండ సురేష్ తపన. అందుకే… నిర్మాత ఎవరైనా సరే – తనవంతు వాటా తప్పకుండా ఉంటుంది. సినిమాకి భారీదనాన్ని తీసుకురావడంలో బెల్లంకొండ సురేష్ చేయి తప్పని సరి. బెల్లంకొండ పక్కన స్టార్ హీరోయిన్ని తీసుకురావాలన్న తపన, స్టార్ టెక్నీషియన్లు టీమ్‌లో ఉండాలన్న ఆలోచనతో.. బెల్లంకొండ బడ్జెట్లు చేయిదాటిపోతున్నాయి. నిజానికి అల్లుడు శ్రీను, జయ జానకి నాయక, సాక్ష్యం కథల్ని తక్కువ స్కేళ్లలోనూ తీయొచ్చు. కానీ.. అవసరానికి మించి ఖర్చు పెట్టారు. ఇప్పుడు అదే నిర్మాతలకు గుదిబండగా మారుతున్నాయి. సినిమాని మంచి రేటుకే అమ్ముకోవచ్చు గాక.. కానీ… వాటిని బయ్యర్లు తిరిగిరాబట్టుకోవాలి కదా? ఆ విషయంలోనే తప్పు జరుగుతోంది. కథలు, దర్శకుల ఎంపికలో జాగ్రత్తగా ఉన్న… బెల్లంకొండ ఇక బడ్జెట్ల విషయంలోనూ ఆలోచించుకుంటే బాగుంటుంది.