ముందు నుంచీ కాస్త తెలివైన అడుగులే వేసుకుంటూ వస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. వెనుక బెల్లంకొండ సురేష్ అండా దండా ఉండడం బాగా కలిసొచ్చింది. అందుకే తొలి సినిమాకే వినాయక్‌తో పనిచేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఆ తరవాత బోయపాటి శ్రీనులాంటి అగ్ర దర్శకుడితో సినిమా చేయగలిగాడు. ఇప్పుడు ‘సాక్ష్యం’లో నటిస్తున్నాడు. అగ్ర దర్శకులతో పనిచేయడం బెల్లంకొండకు బాగా కలిసొచ్చింది. అతని మార్కెట్ సినిమా సినిమాకీ పెరుగుతూ వస్తోంది. ‘సాక్ష్యం’ శాటిలైట్ హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోవడమే అందుకు ‘సాక్ష్యం’. హిందీ రైట్స్ ఇప్పటికే రూ.8 కోట్లకు అమ్ముడయ్యాయి. తెలుగు శాటిలైట్ రైట్స్ రూ.5.5 కోట్లకు జీ తెలుగు కొనుక్కుంది. అంటే శాటిటైల్ రూపంలోనే ఏకంగా రూ.13.5 కోట్లు వచ్చేశాయన్నమాట. తన బడ్జెట్ విషయంలో కాస్త కంట్రోల్‌గా ఉంటే.. బెల్లంకొండ తో సినిమాలు చేసే నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్‌తో బయటపడొచ్చన్న నమ్మకం ఈ అంకెలు కల్పిస్తున్నాయి. ‘సాక్ష్యం’పై చిత్రసీమలో మంచి నమ్మకాలే ఉన్నాయి. శ్రీవాస్ ఈ సినిమాలో ఓ కొత్త తరహా కథ ఎంచుకున్నట్టు సమాచారం. టేకింగ్, విజువలైజేషన్, క్యారెక్టరైజేషన్ అన్నీ షాకింగ్‌గా ఉండబోతున్నాయని టాక్. పాజిటీవ్ ఫీడ్ బ్యాక్ వల్లే… విడుదలకు ముందే శాటిలైట్‌కి ఈ స్థాయి రేటు పలికింది.