బెల్లంకొండ శ్రీనివాస్… అల్లుడు శ్రీను సినిమాతో సర్రున దూసుకువచ్చాడు. డాడీ సురేష్ ప్లానింగ్ కావచ్చు, హిందీ డబ్బింగ్, శాటిలైట్ మార్కెట్ కావచ్చు. మంచి సినిమాలే పడ్డాయి. కానీ బడ్జెట్ ప్లానింగ్ లో తేడా, అమ్మకాల్లో తేడా లాంటి కారణాలతో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కటి కూడా నిర్మాతలకు కానీ, బయ్యర్లకు కానీ లాభాలు మిగిల్చిన ప్రాజెక్టు లేదు.
వివి వినాయక్, భీమినేని, బోయపాటి, శ్రీవాస్, తేజ ల మీదుగా రమేష్ వర్మ దగ్గరకు వచ్చి ఆగింది బెల్లంకొండ కెరీర్ గ్రాఫ్. బోయపాటి, శ్రీవాస్ చేసిన సినిమాలు మంచి సబ్జెక్ట్ లే. కానీ ఒకటి కాస్ట్ ఫెయిల్యూర్, మరోటి డైరక్టర్ ఫెయిల్యూర్ గా మిగిలింది. ఇలాంటి టైమ్ లో తేజ సినిమా ఒప్పుకోవడమే తప్పు. పైగా వెంకటేష్ రిజెక్ట్ చేసిన కథను, పదేళ్లుగా హిట్ అన్నది లేని తేజ ను నమ్మి సినిమా చేయడం (తేజ లాస్ట్ సినిమా నేనే రాజు నేనే మంత్రి గట్టెక్కడానికి చాలా కారణాలు వున్నాయి) అన్నది బెల్లంకొండ కెరీర్ ను చాలా కిందకు తోసింది.
ఇప్పుడు తేజ డైరక్షన్ ఫాల్ట్, కథ బాలేదు, హీరో క్యారెక్టరైజేషన్ డిజైనింగ్ బాలేదు అనడం లేదు. బెల్లంకొండ బాగా చేయలేదు అంటున్నారు. తేజ సినిమా వుండగానే ఎంత రీమేక్ అయినా రమేష్ వర్మ లాంటి డైరక్టర్ ను నమ్ముకోవడం అంటే ఏమనాలి? యంగ్ హీరోలు అంతా వైవిధ్యమైన కథలు, కొత్త ఆలోచనలు పట్టుకువస్తున్న యువ దర్శకులను నమ్ముకుంటూ వుంటే, బెల్లంకొండ మాత్రం కాలం చెల్లిన అని జనం అనుకునే భీమినేని, తేజ, రమేష్ వర్మ లాంటి వాళ్లకు అవకాశాలు ఇచ్చారు.
ఎవరి నిర్ణయాలు అయినా, ఎవరి ప్లానింగ్ అయినా ప్రస్తుతానికి నష్టపోతున్నది బెల్లంకొండ శ్రీనివాస్ నే. తన ఫిజిక్ కు, తన బాడీ లాంగ్వేజ్ కు, తనకు నప్పే కథలు వెదుక్కోవాలి. ఆలస్యమైనా సరే, సరైన ప్రాజెక్టుతో జనం ముందుకు రావాలి. లేదూ అంటే ఈ టఫ్ కాంపిటీషన్ లో కిందకు జారిపోయే ప్రమాదం వుంది.