అల్లుడు శీను తరవాత మళ్లీ ఓ మోస్తరు సినిమా రావడానికి చాలా కాలం ఎదురుచూశాడు బెల్లంకొండ శ్రీనివాస్. రాక్షసుడు విజయంతో కాస్త తెరిపిన పడ్డాడు. అయితే.. ఈలోగా బెల్లంకొండ మార్కెట్ కాస్త బలపడింది. ముఖ్యంగా హిందీ శాటిలైట్ విషయంలో బెల్లంకొండకు బాగానే గిట్టుబాటు అవుతోంది. బెల్లంకొండ సినిమా అంటే హిందీ నుంచి కనీసం 6 నుంచి 7 కోట్ల వరకూ వస్తున్నాయి. తెలుగులో శాటిలైట్ డిజిటల్ రైట్స్ అన్నీ కలుపుకుంటే మరో 4 కోట్లు వేసుకోవచ్చు. అలా దాదాపు పది కోట్ల బిజినెస్ రిలీజ్‌కి ముందే పూర్తవుతుంది. ఈ లెక్కలతోనే బెల్లంబాబు ఇప్పుడు తన పారితోషికం 10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట.
ఈమధ్య ఓ దర్శకుడు ఓ కథ పట్టుకుని బెల్లంకొండ చుట్టూ తిరిగాడు. కథ నచ్చింది గానీ, పది కోట్లు ఇస్తే చేస్తా అని షరతు పెట్టాడట. ఆ డబ్బులు ఇచ్చుకోలేక.. ఆ దర్శకుడు మరో హీరోని పట్టుకున్నాడు. నిజానికి బెల్లంకొండ సినిమాలన్నింటికీ సురేష్ బ్యాక్ బోన్‌గా ఉంటూ వస్తున్నాడు. దాదాపు ప్రతీ సినిమాకీ తనే డబ్బులు పెట్టాడు. ఆ సమయంలో బెల్లంకొండ పారితోషికం ఇంత అనే సమస్య రాలేదు. అయితే ఇప్పుడు బయటి నిర్మాతలు బెల్లంకొండతో సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. వాళ్లకు తన శాటిలైట్ రేట్లు చూపించి పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నాడు బెల్లంకొండ. పదంటే మరీ ఎక్కువ గానీ, 5 – 6 అయితే బెల్లంకొండతో సినిమా గిట్టుబాటు అయిపోతుంది.