బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలకు ఓ లెక్క వుంటుంది. అదేంటంటే? కథ ఏదైనా, పాత్ర ఎలాంటిదైనా, సినిమాలో ఎంతమంది ఆర్టిస్టులున్నా… హీరోగారి పక్కన స్టార్ హీరోయిన్ నటించాల్సిందే. ‘స్పీడున్నోడు’ తప్పిస్తే… బెల్లంకొండ చేసిన మిగతా రెండు సినిమాల్లో స్టార్ హీరోయిన్లతో నటించాడు. ‘అల్లుడు శీను’లో సమంత హీరోయిన్ అయితే… ‘జయ జానకి నాయక’లో రకుల్ హీరోయిన్. ప్రస్తుతం సెట్స్ మీదున్న ‘సాక్ష్యం’లో పూజా హెగ్డే హీరోయిన్. ‘అల్లుడు శీను’, ‘స్పీడున్నోడు’ సినిమాల్లో తమన్నా ఐటమ్ సాంగ్ చేస్తే… ‘జయ జానకి నాయక’లో కేథరిన్ ఐటమ్ సాంగ్ చేసింది. ఇక, ఆ సినిమాలో పెద్దగా ప్రాధాన్యత లేని సెకండ్ హీరోయిన్ రోల్‌కి ప్రగ్యా జైస్వాల్‌ని సెలెక్ట్ చేశారు. ఇప్పుడీ హీరోయిన్ల ప్రస్తావన ఎందుకంటే? బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఏ సినిమా చేస్తే.. ఆ సమయానికి మార్కెట్లో మాంచి క్రేజ్ వున్న హీరోయిన్ని సెలెక్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ ప్రెజెంట్ తెలుగు టాప్ హీరోయిన్లతో ఆయన సినిమాలు చేశారు. కొత్త సినిమా కోసం ఇంకొక క్రేజీ హీరోయిన్ కావల్సి వచ్చింది.
‘సాక్ష్యం’ తరవాత కొత్త దర్శకుడు శ్రీనివాస్‌తో వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ శొంఠినేని నిర్మాణంలో ఒక సినిమా చేయనున్నాడు. ఇందులో హీరోయిన్గా కాజల్ అగర్వాల్‌ని సెలెక్ట్ చేశారు. సినిమాలో సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఒకటి వుంది. ఆ హీరోయిన్ వేటలో సినిమా టీమ్ బిజీగా వుంది. ఒకసారి నటించిన హీరోయిన్ని మళ్లీ రిపీట్ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదట. దాంతో చిక్కు వస్తుంది. కాజల్ మెయిన్ హీరోయిన్ కావడంతో సెకండ్ హీరోయిన్‌కి ఏం ఇంపార్టెన్స్ వుంటుందని కొందరు భామలు ఆలోచిస్తున్నారు. తనయుడి సినిమా కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్, ఏ హీరోయిన్ చేత యస్ అనిపిస్తారో చూడాలి.