పూరి జగన్నాథ్, వివి వినాయక్.. మామూలు దర్శకులు కాదు. ఇండస్ట్రీ హిట్లు ఇచ్చారు. మాస్ పండగ చేసుకునే సినిమాలు తీశారు. అయితే గత కొన్నేళ్ళుగా మునపటి హవా లేదు. వినాయక్ సినిమాలు చేయడమే తగ్గించేశారు. పూరి చేస్తున్న సినిమాలు నిరాశ పరుస్తున్నాయి. వాళ్ళ హవా అయిపోయిందనే కామెంట్లు కూడా వినిపిస్తుంటాయి. ఇదే మాట సీనియర్ నిర్మాత బెల్లంకొండ సురేష్ వద్ద ప్రాస్తవిస్తే.. ఆయన ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.
‘బంతి ఎంత జోరుగా కిందకు పడితే అంత జోరుగా పైకి లేస్తుంది. వినాయక్, పూరి గాలి వున్న బంతులు. అవి ఎప్పటికైన పైకి లేస్తాయి. సినిమా తీయడంలో, మాస్ పల్స్ పట్టుకోవడంలో వారికున్న కమాండ్ అసామాన్యం. ఇప్పటికీ అడ్వాన్స్ ఇచ్చి డైరెక్టర్ ని ఎంపిక చేసుకోవాలంటే నా ఓటు పూరికే. 90 రోజుల్లో సినిమా తీసి రిలీజ్ చేసే దర్శకుడు నిర్మాతకి, ఇండస్ట్రీకి కావాలి’ అని పూరి, వినాయక్ లపై తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు బెల్లంకొండ.
వినాయక్, పూరి ఫ్యాన్స్ కి కావాల్సినది కూడా ఇదే. వాళ్ళ హవా మళ్ళీ రావాలి. విజయాలు అందుకోవాలి. అన్నట్టు.. బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో నిర్మాతగా 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. కొన్నేళ్ళుగా ప్రొడక్షన్ కి దూరంగా ఉంటున్న ఆయన ఏప్రిల్ నుంచి మళ్ళీ ప్రొడక్షన్ మొదలుపెడుతున్నారు. రెండు ప్రాజెక్ట్స్ ఫైనల్ అయ్యాయి. త్వరలో వాటి వివరాలు బయటికి వస్తాయి.