చంద్రబాబు పెన్షన్లు ఆపారంటూ చేస్తున్న ప్రచారానికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి బుధవారం ఏపీ ప్రభుత్వానికి ఎదురయింది. వాలంటర్లు వచ్చి పంపిణీ చేయకపోతే పోయారు.. తామే వచ్చి తీసుకుంటామని.. గ్రామ, వార్డు సచివాలయాల వద్దకు పెద్ద ఎత్తున వచ్చిన లబ్దిదారులుక పెన్షన్లు పంపిణీ చేయలేదు. ప్రభుత్వం డబ్బులు ఖాతాల్లో వేయలేదని.. వేయగానే డ్రా చేసి పంపిణీ చేస్తామని చెప్పారు. 70 శాతం గ్రామ సచివాలయాల ఖాతాల్లో ఇంత వరకూ నగదు జమ చేయలేదు. 30 శాతం చోట్ల జమ చేయడంతో.. కొన్ని చోట్ల మధ్యాహ్నం సమయంలో కొంత మందికి పంపిణీ చేశారు.
చంద్రబాబు అడ్డుకుంటే.. తాము సచివాలయాల దగ్గరకు వచ్చినా ఎందుకు ఇవ్వడం లేదని చాలా మంది వృద్ధులు .. ఉద్యోగులతో వాదనకు దిగారు. వారంతా మొహమాటం పెట్టుకోకుండా ప్రభుత్వం డబ్బులివ్వలేదని తేల్చి చెప్పారు. అడ్డుకోవడం వల్ల కాదని.. డబ్బుల్లేకపోవడం వల్లేనని వృద్ధులకు క్లారిటీ వచ్చింది. ఆర్బీఐ నుంచి నాలుగు వేల కోట్ల రుణం రావడంతో.. ఆర్బీఐకి కట్టాల్సిన రుణం పోను.. వచ్చిన డబ్బుల్లో కొంత సెక్రటేరియట్ ఉద్యోగులు, పోలీసులు, న్యాయశాఖల సిబ్బందికి జమ చేశారు. మిగిలిన అరకొర డబ్బులు పెన్షన్లకు ఇచ్చారు. పూర్తి స్థాయిలో నగదు పంపిణీ చేయాలంటే.. మరో మంగళవారం అప్పు రావాల్సిందేనన్న వాదన వినిపిస్తోంది.
అయితే పెన్షన్లు ఇస్తారంటూ.. వైసీపీ నేతలు వృద్ధుల్ని సచివాలయాల దగ్గరకు తీసుకు వచ్చారు. వారిలో చాలా మంది ఎండలకు ఇబ్బంది పడ్డారు. మంచాన పడ్డవారు.. తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి ఇంటి వద్దనే పంపిణీ చేయాలన్న ఆదేశాలు ఉన్నాయి. అయినా రాజకీయం కోసం వృద్ధుల్ని ఇబ్బంది పెట్టారు. రాజకీయం కోసం కొంత మంది ప్రాణాల్ని సైతం పణంగా పెట్టడంతో వైసీపీ తీరుపై విమర్శలు వస్తున్నాయి.