తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి తీరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందో చెప్పలేం! ఏ సందర్భంలో ఎలా మాట్లాడేస్తారో అనే టెన్షన్ టీడీపీ శ్రేణులకు ఎప్పుడూ ఉంటుంది. గురువారం కూడా అలాంటి గందరగోళ పరిస్థితిని కాసేపు సృష్టించారు. తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా అంటూ విలేకరుల సమావేశంలో ప్రకటించి షాక్ ఇచ్చారు. ఉన్నట్టుండి ఈ రాజీనామా ఎందుకంటే.. అనంతపురం ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చలేకపోతున్నాననీ, చాగల్లుకు నీటిని తెప్పించలేకపోయాననీ, తాడిపత్రి ప్రజల సాగూ తాగు నీటి అవసరాలు తీర్చలేకపోయాననే బాధతోనే రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించారు. మరో రెండు మూడు రోజుల్లో తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ కు అందించబోతున్నాననీ అన్నారు. పోనీ, ఈ తరుణంలో చంద్రబాబు సర్కారు తీరుపై విమర్శలు గుప్పించారా అంటే అదీ లేదు! చంద్రబాబు సమర్థుడైన పాలకుడు అనీ, రాష్ట్రానికి ఆయన నాయకత్వం అవసరమనీ, రాజీనామా చేసినా కూడా తాను ఆయన వెంటే ఉంటాననీ, వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవడం ఖాయమన్నారు.
జేసీ రాజీనామా అని ప్రకటించగానే.. ‘నిజమేనా’ అనే అనుమానం అందరికీ కలిగింది. ఈ మాట మీద ఆయన నిలబడతారా అనే చర్చ మొదలైంది. అందుకు తగ్గట్టుగానే ఆ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే జేసీ మెత్తబడ్డారు. అలా చెప్పేకంటే.. ఆయన్ని అలా మెత్తబెట్టారు అనడం కరెక్ట్! జేసీ రాజీనామా ప్రకటన చేసిన వెంటనే టీడీపీ సర్కారులో చలనం వచ్చేసింది. మంత్రి దేవినేని ఉమ, అనంతపురం జిల్లా కలెక్టర్, ఇ.ఎన్.సి. వెంకటేశ్వరరావులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. చాగల్లు జలాశయానికి వెంటనే నీటిని విడుదల చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు. 200 క్యూసెక్కుల నీటిని చాగల్లు రిజర్వాయర్ కు విడుదల చేయాలని మంత్రి దేవినేని ప్రకటించారు. ఆ తరువాత, జేసీకి ఉమ ఫోన్ చేశారు. జీడిపల్లి నీటి మట్టం పెరిగే వరకూ చేసి, ఆ తరువాత చాగల్లు నీటిని ఇద్దామని అనుకున్నామని వివరణ ఇచ్చారు. దీంతో జేసీ రాజీనామా వ్యవహారంపై మెత్తబడ్డారని అంటున్నారు!
సరే, ఈ రాజీనామా డ్రామా వల్ల ఏం ఒరిగినట్టు..? జేసీ తీరువల్ల టీడీపీకి మరోసారి తలవంపుల పరిస్థితి తీసుకొచ్చారు. ఒక రిజర్వాయరుకు నీటిని విడుదల చేయించుకోవాలంటే.. ఎంపీ రాజీనామా వరకూ వెళ్లాలా..? అధికార పార్టీ ఎంపీ నియోజక వర్గంలోనే ఇలాంటి పరిస్థితి ఉందా..? ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై జేసీకి ఈ స్థాయిలో అసంతృప్తి ఉందా..? టీడీపీ హయాంలో నేతలు రాజీనామా వరకూ వెళ్తే తప్ప.. ఏ పనులూ కావడం లేదని చాటి చెప్పేందుకే జేసీ ఇలా ప్రకటించారా… ఇలా చాలా అనుమానాలకు తావిచ్చే విధంగా ఆయన వ్యవహరించారు. ఏరకంగా చూసుకున్నా ఇది అధికార పార్టీకి తలవంపులు తీసుకొచ్చే పనే.
పోనీ.. పార్టీ సంగతి కాసేపు పక్కనెడదాం. ఈ రాజీనామా ప్రకటన ద్వారా సొంతంగా జేసీ సాధించుకున్నది ఏదైనా ఉందా అంటే.. అదీ లేదనే చెప్పాలి. చాగల్లుకు నీరు తెప్పించాలంటే వేరే మార్గంలో ప్రయత్నం చెయ్యొచ్చు కదా! అవేవీ జేసీకి తెలియవని చెబుతున్నట్టా..? అధికార పార్టీ ఎంపీగా ఉంటూ సొంత నియోక వర్గంలో పనుల్ని చేయించుకోలేకపోతున్నారనే విషయం బయట ప్రపంచానికి చాటి చెప్పినట్టయింది. అంతేకాదు, రాజీనామా చేస్తానని ప్రకటించి, మళ్లీ వెనక్కి తగ్గడం ద్వారా మాట మీద నిలబడేంత సీన్ జేసీకి లేదని కూడా అనుకుంటారుగా! ఆయనవి ఎప్పుడూ తాటాకు చప్పుళ్లే అనే చులకన భావం కూడా వస్తుంది కదా. ఏతావాతా ఈ డ్రామాతో ఏం సాధించినట్టు..?