కర్నూలు జిల్లా వాసులు ఎప్పటి నుండో హైకోర్టును కోరుతున్నారు. రాష్ట్ర విభజన తరవాత గతంలో త్యాగం చేసిన రాజధాని.. మళ్లీ వస్తుందేమో అని ఎదురు చూశారు. కానీ..అందరికీ అందుబాటులో ఉంటుందన్న ఉద్దేశంతో.. అమరావతిని గత ప్రభుత్వం ఎంపిక చేసింది. కొత్త ప్రభుత్వం అమరావతిని మార్చాలనుకుంది. కానీ.. రాజధానిని మాత్రం కర్నూలుకు ఇవ్వలేదు. హైకోర్టును మాత్రం ప్రకటించిది. అదే సమయంలో.. హైకోర్టు బెంచ్‌లను.. అమరావతి, విశాఖల్లో ఏర్పాటు చేస్తున్నారు. అంటే.. హైకోర్టులో ఓ భాగమే. దాని వల్ల.. పెద్దగా ఉపయోగపడేది ఏమీ ఉండదని…రాయలసీమ నేతలు పెదవి విరుస్తున్నారు.
గ్రేటర్ రాయలసీమకు రాజధాని ఇవ్వాలని లేకపోతే.. ప్రత్యేక రాష్ట్రం ప్రకటించాలని.. నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలుపుకుని కొంత మంది రాయలసీమ నేతలు.. పోరాటం ప్రారంభించారు. రాయలసీమను దశాబ్దాలుగా.. నేతలు ఆన్యాయం చేస్తున్నారనేది వారి వాదన. తమిళనాడుతో విడిపోయిన సమయంలో.. కర్నూలును రాజధానిగా ప్రకటించారని.. కానీ..కలసి ఉండాలన్న ఉద్దేశంతో త్యాగం చేశామని.. అప్పుడు అమలు చేస్తామన్న హామీలను పాలకులు ఇప్పటి వరకూ పట్టించుకోలేదన్న అసంతృప్తి రాయలసీమలో ఉంది. పలు సందర్భాల్లో… ఈ అసంతృప్తి బయటపడింది. ఇప్పుడు… జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజధానులను మార్చాలని నిర్ణయించుకున్న తర్వాత.. రాయలసీమ గురించి పట్టించుకోకుండా.. అభివృద్ధి చెందిన విశాఖను రాజధానిగా ప్రకటించారని.. అది కూడా.. రాయలసీమకు సుదూరంగా నిర్ణయించడం.. అక్కడి ప్రజల్లో నేతల్లో అసహనానికి కారణం అవుతోంది.
విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను తరలించడం వల్ల.. రాయలసీమకు మరింత నష్టం జరుగుతుందంటున్నారు. అందుకే రాజధాని ఇస్తే ఇవ్వండి..లేకపోతే.. ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. రాజధాని మార్పుపై రాయలసీమలో వ్యతిరేకతే ఎక్కువగా కనిపిస్తోంది. కర్నూలులో హైకోర్టు పెడితే లాభం ఏముందన్న ప్రశ్న అందరిలోనూ వస్తోంది.రాజధాని విశాఖకు తరలిపోతే సీమ ఘోరంగా నష్టపోతుంన్న అభిప్రాయాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. కేబినెట్ నిర్ణయం తర్వాత అక్కడా నిరసనలు వెల్లువెత్తే అవకాశం కనిపిస్తోంది.