విభజన చట్టంలో ఉన్న ఉమ్మడి రాజధాని అంశానికి జూన్ రెండో తేదీన ముగింపు రాబోతోంది. మరోసారి పొడిగింపు అసాధ్యం అని తెలిసినా సరే కొంత మంది ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలనే డిమాండ్ చేస్తున్నారు. ఇలా డిమాండ్ చేసే ముందు ఉమ్మడిగా కొనసాగించడం వల్ల ఏపీ కొత్తగా పొందే ప్రయోజనాలేంటి ? ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లేకపోతే ఏపీకి.. అక్కడి ప్రజలకు జరిగే నష్టం ఏమిటి ? .. పోనీ కోల్పోయేది ఏమైనా ఉందా అంటే.. అదీ కూడా చెప్పడం లేదు. ఉత్తినే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగించాలంటున్నారు.
ఏపీకి ఇచ్చినవి ఎప్పుడో తెలంగాణకు ఇచ్చేసిన సీఎం జగన్
హైదరాబాద్ లో ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి ఉన్న అడ్రస్ ఏదైనా ఉందంటే అది లేక్ వ్యూ గెస్ట్ హౌస్. పదేళ్ల పాటు సచివాలం భవనాల్లో సగం ఏపీకి ఇచ్చారు. కానీ జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రమాణస్వీకారం కూడా చేయకుండానే భవనాలు ఇచ్చేశారు. వాటిని కూలగొట్టేసి కేసీఆర్ కొత్త సచివాలయం నిర్మించారు. ఏపీలో కొత్త సచివాలయం పునాదులపై ఒక్క ఇటుక కూడా జగన్ పెట్టలేదు. ఏపీకి ఉన్న ఒకే ఒక్క అడ్రస్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్. ఎప్పుడైనా దాన్ని ఉపయోగించుకున్నారా అంటే… అది చంద్రబాబుపై తప్పుడు కేసుల ప్రెస్మీట్లు పెట్టడానికే.
సెక్షన్ 8ని పదేళ్లలో ఎప్పుడైనా వాడాల్సిన అవసరం వచ్చిందా ?
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంే.. సెక్షన్ 8 అనేది ఉనికిలో ఉంటుంది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్కు సంబంధించిన అంశాల్లో.. గవర్నర్కు విశేషాధికారాలు కల్పిస్తూ.. విభజన చట్టంలో సెక్షన్ 8ను చేర్చారు. ఈ అధికారాలను గతంలో గవర్నర్ నరసింహన్ వాడుకునే ప్రయత్నం చేశారు కానీ.. కేసీఆర్ వాటిని చాకచక్యంగా ఆపేయగలిగారు సెక్షన్ 8 ప్రకారం హైదరాబాద్లో ప్రభుత్వం ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోవాలన్న గవర్నర్ అనుమతి తీసుకోవాలి. సెక్షన్ 8 అంశం పూర్తిగా గవర్నర్ అధికారాలకు సంబంధించినది. సీమాంధ్రులకు సమస్య వస్తే గవర్నర్.. ఆ సెక్షన్ ను ఉపయోగించుకోవచ్చు. పదేళ్లలో అలాంటి సమస్య రాలేదు.
ఉమ్మడిగా ఉన్నా… తెలంగాణ రాజధానిగా ఉన్నా ప్రజలకు తేడా లేదు !
హైదరాబాద్ ఏపీ ఉమ్మడి రాజధానిగా ఉన్నా.. తెలంగాణ రాజధానిగా ఉన్న ప్రజలకు పెద్దగా పట్టింపు లేదు. ఎందుకంటే హైదరాబాద్ విషయంలో విభజన కు ముందు.. ఆ తర్వాత కూడా ఎవరికీ సమస్యలు రాలేదు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎప్పట్లానే పొందుతున్నారు. ఎవరూ ఆంక్షలు పెట్టడంలేదు . గతంలో తెలంగాణ ప్రభుత్వం అంబులెన్స్ లు ఆపేస్తే .. మాట్లాడేందుకు కూడా మందుకు రాని ప్రభుత్వాలు ఉన్నంత కాలం అలాంటి హక్కులు ఆపినా వాడుకోవడానికి కూడా ఉండదు. అందుకే .. రాజకీయాల కోసం ఉమ్మడి రాజధాని పేరుతో హడావుడి చేస్తే ప్రజలకే నష్టం జరుగుతుంది.